పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

క.

శ్రీకర కీర్తివరారో | [1]హాకేళీమందిరాయితాజాండవధూ
లోకవిలోకచకోరని | శాకర! కొలిపాక యెఱ్ఱ సచివ[2]వరేణ్యా!

1


వ.

ఆకర్ణింపుము. రోమశుండు మార్కండేయున కిట్లనియె.

2


ఆదివరాహమూర్తి భీషణవిహారము

ఆ.

ఆమహావరాహ మత్యంతభీషణ | దేహ మమర, దళితదిక్క మగుచు,
జానుదఘ్నసప్త[3]సాగరజలములఁ | గలఁచి, పంకిలములుగా నొనర్చె.

3


సీ.

ఘనతరఘోణాగ్రమున నొక్కచో ధాత్రి | ఘుర్ఘురధ్వనులతోఁ [4]గుద్దలించుఁ,
బాదుగా నిల్చి సంభ్రమమున నొకచోటఁ | గొసవెండ్రుకలు నిక్కఁ గొప్పరించుఁ,
గఠినవాలము బెట్టుగాఁ [5]దీసి యొకచోటఁ | గడిమిమై రొప్పుచు గద్దరించు,
భూరి[6]దంష్ట్రాటంకముల గ్రుచ్చి యొకచోట | నగముల నుడువీథి కెగురఁజిమ్ముఁ,


తే.

చరణఖురఘట్టనంబుల జలధిమధ్య | జంతుజాలంబు నొకచోట సంహరించు,
దుష్టశిక్షణ [7]భక్తివిశిష్టరక్ష | ణాకులంబైన యమ్మేటియేకలంబు.

4


వ.

ఇట్లు బహుప్రకారంబుల విహారంబు సల్పి, జగదాభీలం బగుచున్న యయ్యాది
[8]కోలంబుఁ గనుంగొని, హిరణ్యాక్షుండు రోషకషాయితాక్షుం డగుచు, సింహనాదంబుల దిగ్వే
దండంబుల బెండుపడం జేయుచు డగ్గఱి.

5


హిరణ్యాక్షుఁడు వరాహమూర్తిని దాఁకుట

శా.

కోపోద్రేకకరాళభావమున రక్షోవల్లభుం డార్చి, లీ
లాపోత్రిం గరశాతఖడ్గహతి నుల్కంజేసి, తద్ఘోరదం
ష్ట్రాపాతంబున కోహటించి, నిశితాస్త్రంబుల్ ప్రయోగించి, మా
యాపాండిత్యము చూపినం, గనలి బ్రహ్మాండంబు ఘూర్ణిల్లఁగన్.

6
  1. ఈ పా. తి,ర.ప్ర. లో లుప్తము; హాకృతనిరతపరిరంభయాశ్రితకవిరాళ్ళోకవిలోక - తీ
  2. కుమారా - క
  3. సాగరీ - మ, మా
  4. గుండలించు - మా,త
  5. వీచి - మా,హ,ర
  6. దంష్ట్రోదగ్ర - తి
  7. శిష్ట - తీ
  8. క్రోడంబు - క