పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

వరాహపురాణము


మ.

సమరాజేంద్రుని గూర్చి సామము, భుజాశౌర్యాధికున్ గూర్చి దా
నము, [1]వీనం గలయంగనేరని మహీనాథాగ్రణిం గూర్చి భే
దము, శక్తిత్రయహీనుఁ గూర్చి కడిమిం దండంబు గావింప యు
క్తము భూపాలున, కాత్మరాజ్యపరిరక్షాకార్యనిస్తంద్రతన్.

182


తే.

[2]నీతిమార్గంబు వదలకనృపతి భావి | కార్య మాప్తబుధామాత్యగణముతోడ
నూహ యొనరించి, కుశలుఁడై యుండవలయు | మంత్రరక్షణవిధి నప్రమత్తుఁ డగుచు.

183


క.

బలిమిగలనాఁడె విమతులఁ | బొలియింపఁగ నేర్పులేనిభూవరులకుఁ, ద
[3]త్కులశేషముచేతనె చెడుఁ | గలిమియు రాజ్యంబు బంధుగరిమయు ననఘా!

184


క.

కావున, శాత్రవశేషము | భూవరుఁ డుచ్ఛిన్నమూలముగ నణఁగింపం
గావలయు, సహితరహితమ | హీవలయం బేలుకన్న హితముం గలదే?

185


చ.

అనిమిషకోటిదక్క మన కన్యులు లేరు విరోధు, లమ్మహా
ఘనులు సురాచలంబున సుఖస్థితి నిల్చినవారు, వారికిం
దనుజవిదారి రక్షకుఁ, డతండు నిశాటులఁ జక్రధారలం
దునిమి, యొసంగు నింద్రున కనూనమతిం ద్రిదివాధిపత్యమున్.

186


క.

[4]నిశ్శేషంబుగ దనుజమ | నశ్శల్యములైన సురగణంబుల నెల్లన్
దోశ్శక్తిఁ దునుముటకు ర | క్షశ్శేఖర! తగునుపాయగతి నూహింపన్.

187


వ.

అని పలికి, వెండియు నిట్లనియె.

188


సీ.

ఒక్క కార్యము దోఁచియున్నది నామది | నది విను మెఱిఁగింతు [5]నసురనాథ!
త్రిదశాలయంబు రాత్రించరేశ్వరులకు | భోగ[6]భాగ్యనివాస[7]భూమి యయ్యె,
దివిజలోకమున వర్తించినవారల | కిష్టంబు గాదు మహీసుఖంబు,
కావున, నీవు బాహావిజృంభణమునఁ | బృథివితోఁ గనకాద్రిఁ బెనఁచిపట్టి


తే.

వార్ధిలోపల మునుఁగంగ వైచితేని, | యమరమునిసిద్ధకిన్నరయక్షవరులు
సమసిపోవుదు, రంత నిశ్శంకలీల | నేలుదువు నీవు సురలోక మెల్ల గరిమ.

189


తే.

అని సునాసీరుఁ డెఱిఁగింప ననుమతించి, | కనకనేత్రుండు తత్కార్యకరణమునకు
సముచితోసాయపరులైన సచివవరుల | తోడ నూహించి, పిదప నుద్యుక్తుఁడయ్యె!

190
  1. దీనం - అన్ని ప్ర.
  2. ఈ ప. తీ.ప్ర. లో లుప్తము
  3. త్కాలవిశేషముచేతనె (ప్రాస?) - మ; త్కలశేషము - తా,హ; త్కలమశేషము - ర
  4. ఈ ప. తీ,ప్ర,లో లుప్తము
  5. నవనినాథ - మ,మా,త,తి,తీ,హ,ర,క
  6. యోగ్య - మ,మా,త,తి,తీ,హ,ర,క
  7. యోగభూమి - క