పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

వరాహపురాణము


మ.

అనలుం డేసె నిశాటవల్లభునిపై నభ్రంలిహప్రజ్వల
ద్ఘనకీలా సముదాయమున్, జనదృగగ్రాహ్యస్ఫులింగావళీ
జనితధ్వానవిశేషవజ్ర[1]భవగర్జాభిన్నదై తేయమున్,
దినరాణ్మండలకోటితుల్యసుషమాస్థేయంబు, నాగ్నేయమున్.

167


క.

ఏసినఁ గలంగి నిజసే | నాసముదాయంబు చెదరినం గని, భువన
త్రాసకుఁడగు దనుజేశ్వరుఁ | డాసమయమునందు దివిజు లద్భుత మందన్.

168


ఆ.

[2]బెదరి పఱచువారిఁ బేర్వేఱఁ జీరుచు | నెదురునడుచువారిఁ గదియఁ [3]జనుచు
గురుపరాక్రమమునఁ గోదండ మెక్కించి | చతురుఁ డగుచు [4]రాత్రిచరవరుండు.

169


క.

వారుణబాణంబున దు | ర్వారానలబాణజనితవహ్నిప్రభలన్
వారించి, దివిజకులసం | హరుఁడు రోషారుణీకృతాక్షుం డగుచున్.

170


చ.

అనలుని నాఱుబాణముల నంటఁగ నేసి, పదేనుతూఁపులన్
వననిధినాథు నొంచి, యనివార్యసహస్రముల న్నిలింపనా
థుని తనువందుఁ గీల్కొలిపి, దుర్గమమార్గణపంచకంబునన్
ఘనుఁడగు దండహస్తుని బ్రకంపితగాత్రుని జేసె నత్తఱిన్.

171


చ.

అపుడు పురందంరుం డలిగి, యగ్నికణంబులు వేయుకన్నులన్
విపులత నిర్గమింపఁగ, రవిప్రభ మించిన వజ్ర మంది, యా
చపలుని గూలవేయుటయుఁ, జయ్యన మూర్ఛిలి దానవేశ్వరుం
డపగతఖేదుఁడై తెలిసి, యద్భుతరోషకషాయితాస్యుఁడై.

172


క.

ఈశవరలబ్ధమగు భయ | దాశుగమున దేవవిభుని యంగము నొంపన్,
ధీశాలి యతఁడు మూర్ఛిలె, | నాశాపతులెల్ల [5]వణక, నమరులు [6]బెగడన్.

173


ఆ.

అంతలోనఁ దెలిసి యమరేంద్రుఁ డత్యుగ్ర | రోషవహ్నిభయదవేషుఁ డగుచు,
నెలమి దైత్యవరుల నెదిరించి కదనంబు, సలిపె బాహుశౌర్యసంభ్రమమున.

174


క.

హరి హేషితములఁ గరి ఘీం | కరణముల [7]రథాంగనేమి ఘననినదములన్,
వరభటకోలాహలముల | ధరణీతల మద్రువం దొణఁగెఁ దత్సమయమునన్.

175
  1. ధవ - క
  2. చెద (యతి?) - తి,హ
  3. నడుచు - మ,తా,తి,తీ,హ,ర,క
  4. రాక్షేశ్వరుండు (యతి?) - మ,తి,హ,ర,క; రాక్షసప్రభుండు - తీ
  5. బెగడ - క
  6. బెదరన్ - మ,తా,తి,హ,ర; వణఁకన్ - క
  7. రథనేమి - మా; రథములనేమి - త