పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

59


వ.

తత్సమయంబున, శౌర్యహర్యక్షుండగు హిరణ్యాక్షుండు, పురందరరమాహరణ
చాతుర్యధుర్యుండగు దనుజాచార్యు వీడ్కొని, యభ్యంతరమందిరంబునకుం జన, మజ్జన
భోజనాదికృత్యంబులు నిర్వర్తించి, దివ్యగంధమాల్యాంబరాభరణంబుల నలంకృతుండై,
[1]సంపాదిత[2]ప్రమోదంబగు ప్రాసాదంబునందును, సంతతోత్సాహ[3]నిదానమ్ములగు నుద్యా
నమ్ములందును, వికసితకమల[4]3కహ్లారంబులగు కాసారంబులందును, రూపవిభ్రమవిలాస
శృంగారరసభాజనంబులగు కామినీజనంబులం గూడి, యామ్రేడితరతిక్రీడాపరతంత్రుండై
యుండె. అంత.

153


ప్రభాతవర్ణనము

మ.

జలజాతంబులు నిద్ర మేలుకొన, నక్షత్రంబు లెందేనియుం
దొలఁగంబాఱ, విహంగసంఘములు అంతుల్ సేయఁ, గహ్లారమం
డలి లావణ్యము జాఱ, జక్కవలు వేడ్కన్ నిక్క, మందానిలం
బెలమిన్వీవఁ, బ్రభాత మయ్యె జగతిన్ హృద్యప్రభాన్వీతమై.

154


సీ.

తిమిర[5]కుంభివిదారణమునకు నుదయాద్రి | [6]దరి నిర్గమించు కేసరి యనంగ,
శీతాంశుకిరణమూర్చితపద్మలక్ష్మికి | సముచిత[7]జీవనౌషధ మనంగ,
యామినీవిరహివిహంగదంపతులకు | సాంగత్య [8]మొనరించు సఖుఁ డనంగ,
భువనాంతరక్షేత్రమున నంశుబీజముల్ | వెదపెట్టు కర్షకవిభుఁ డనంగఁ,


తే.

బరమమునిపుణ్యపరిపాకఫల మనంగఁ, | [9]బ్రాక్సతీపద్మరాగదర్పణ మనంగ,
జంభరిపుసౌధకాంచన[10]కుంభ మనఁగ | సూర్యుఁ డుదయించె [11]నభినందితార్యుఁ డగుచు.

155


అమరారి యమరావతి యాక్రమణము

చ.

అట మును మేలుకాంచి, యసురాన్వయనాయకుఁ డాహ్నికక్రియా
పటలముఁ దీర్చి, మంత్రిహితబంధుపురోహితవారణాశ్వస
ద్భటరథసంఘము ల్గొలువ, బంధురదుందుభినాదసైనికా
ర్భటులు చెలంగ, మత్తగజరాజము నెక్కి, మహెూగ్రమూర్తియై.

156
  1. సంపాదిత - పరతంత్రుండై - వఱకు తీ. ప్ర.లో లుప్తము
  2. ప్రమోదితం - త
  3. నిధానము - మా
  4. కలహార - తి,హ; కల్హార - మ,మా,త,తా,ర,క
  5. కుంభ - త
  6. వెలి - మా
  7. జితజీవసౌధ మనఁగ - త
  8. మొదవించు - త
  9. మూఁడుమూర్తులతేజంపుముద్ద యనఁగ - తీ
  10. మణి యనంగ - ర
  11. వందితాచార్యుఁ డగుచు - తా