పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

వరాహపురాణము

సూర్యాస్తమయవర్ణనము

చ.

కరములు సాఁచి, [1]రాజనిజకాంతఁ, గుముద్వతి నంటెఁ బద్మినీ
వరుఁ, డని లోకులాడు నపవాదము మాన్చుకొనం, బ్రమాణసు
స్థిరమతియై గమించి, [2]జలదివ్య మొనర్చెడువాఁడెపోలెఁ, దా
మరసహితుండు గ్రుంకెఁ జరమస్ఫురితార్ణవమధ్యమంబునన్.

148


ఆ.

చక్రవాకమిథునజాతవియోగాగ్ని | [3]విపులరుచులు వెల్లివిరిసె ననఁగ,
సాంధ్యరాగ మొదవెఁ , జనుఁగ్రొత్తలేతచీఁ | కటి తదీయధూమపటల మనఁగ.

149


చ.

జలరుహబాంధవుం డపరసాగరనీరము సొచ్చె, నింక రాఁ
గలఁడు సుధాంశుఁ, డీనడిమి కందువఁ గాని మదీయజృంభణం
బలవఁడదంచు, భూధరగుహాంతరమార్గవినిర్గతంబులై
[4]కలయఁగఁ బర్వె రోదసి, నఖండగతిం జరఠాంధకారముల్.

150


చ.

సరసుఁడు, తారకాయుతుఁడు, - తుఁడు, రాజకళాకలాపవి
స్ఫురితుఁడు వచ్చుఁ గూర్మిఁ దనుఁ బొందుట కంచుఁ దలంచు యామినీ
తరుణి, రతిక్రియాసముచితంబగు నంబరనూత్నశయ్యపై
నెఱపిన [5]మల్లెమొగ్గ లన నిర్మలతం గనుపట్టెఁ దారకల్.

151


చంద్రోదయసుషమ

సీ.

మోరచిక్కము పద్మములకు, నాఁకటిపంట | రంగచ్చకోర[6]పతంగములకు,
మొగసిరి కైరవంబులకు, నుచ్చాటన | కలితయంత్రం బంధకారమునకు,
వీడాకు నవచక్రవిహగదంపతులకుఁ, | బాయసాన్నము దేవపటలమునకు,
[7]డాకన్ను పద్మాలయాకళత్రున, కభి | చారకృత్యము జారచోరతతికిఁ,


తే.

గూర్మి సైదోడు లచ్చికిఁ, గొడుకుఁగుఱ్ఱ | యంబుధికి, మేనమామ పుష్పాయుధునకు
ననుచుఁ గొనియాడఁ, బూర్వశైలాగ్ర[8]వీథి | సోముఁ డుదయించెఁ జంద్రికోద్దాముఁ డగుచు.

152
  1. రాజు - తా,తీ
  2. జలధివ్య - తా; జలధిశ్వ - తీ
  3. వీపు - మ,త,తా,తి,తీ,హ,ర,క
  4. త. ప్రలో 4 వ పా. 151 ప. లో 1, 2, 3 పా. లుప్తము
  5. మొల్ల - హ,ర
  6. తరంగములకు - తి,తీ
  7. తీ ప్ర. లో పా. లుప్తము
  8. వనధి - తా