పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

57


చ.

అని హరి యానతిచ్చిన, సుధార్ణవతీరము వాసి దేవతల్
మనమున సంతసం బొదవ, మారుతవేగముతోడఁ దన్మహా
దనుజసమాజవాక్కలహతారనినాదసమేతమైన, యా
దనువనుభూమికిం జని ముదంబున నిల్చి, రనంతరంబునన్.

142


కమలాక్షుని కామినీరూపము

సీ.

చిగురుటాకులనవ్వు చిన్నారియడుగులు, | కరితుండముల మించుమెఱుఁగుఁదొడలు,
సికతామయంబు నాక్షేపించు జఘనంబు, | గగనంబునకు బొమ్మ గట్టునడుము,
కనకకుంభముల బింకము దీర్చుచనుదోయి, | యరవిందముల [1]నేలుహస్తయుగము,
కంబుసౌందర్యంబు కబళించుకంఠంబు, | ముదురుచందురుఁ బోలుముద్దు[2]మొగము,


తే.

నలినదళములఁ దలఁపించునయనయుగళి, | తేఁటితొక్కలచెలువంబుఁ దెగడుకురులు
గలిగి, శృంగార[3]రసజీవకళయుఁ బోలెఁ | గాంతయై శౌరి, దైత్యులకడకు వచ్చి.

143


సీ.

మఱపించుఁ గొందఱ మంజులవాక్సుధా | మాధుర్య [4]మనుచొక్కుమందు చల్లి,
తగిలించుఁ గొందఱఁ దళుకు[5]వాలికచూపు | [6]గము లనువలలకుఁ గదియ నొత్తి,
తిగుచుఁ గొందఱ గండయుగకందళితనూత్న | మందహాసం బనుమచ్చు వైచి,
వలపించుఁ గొందఱ వలిగుబ్బపాలిండ్ల | సవరనిమెఱుఁ గనుజలధి ముంచి,


తే.

మోవిపస చూపి కొందఱ మోసపఱచు, | హస్తసంజ్ఞలఁ గొందఱ నాదరించు,
నంచనడపులఁ గొందఱ [7]నపలపించు, | గానరసమునఁ గొందఱఁ గరఁగఁజేయు.

144


క.

ఈకరణి సకలదనుజా | నీకము వంచించి, మానినీ[8]రూపధర
శ్రీకాంతుఁడు దయతోడ సు | ధాకలశము దెచ్చి దేవతల కర్పించెన్.

145


చ.

త్రిదశులు తత్సుధారస మతిప్రమదంబునఁ గ్రోలి, యెన్నఁడున్
ముదిమియుఁ జావు లేని దృఢమూర్తులు దాల్చి, యసాధ్వసంబునం
ద్రిదివపురంబునందు [9]నమరీనికురుంబవిరాజమానసౌ
ఖ్యదమణిసౌధవీథుల నఖండితులై విహరింతు రెప్పుడున్.

146


వ.

అని యిట్లు దానవాచార్యుండు హిరణ్యాక్షునకు సముద్రమథనవృత్తాంతంబు,
నమృతోద్భవంబు తెఱంగు లెఱింగించె. ఆ సమయంబున.

147
  1. బ్రోలు - క
  2. మోము-త,తీ,క
  3. రసములోఁగళయ - తి,తీ,హ,ర
  4. మను సొక్కు - త; మునఁజొక్కు - మ,మా,తి,తీ,హ,క
  5. రాలికె - అన్ని ప్ర.
  6. గతులను - ర
  7. నలపరించు - త
  8. రూపపర - త,తీ,ర; రూపడలి (?) - హ
  9. రమణీ - త