పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

వరాహపురాణము

శ్రీదేవి ప్రాదుర్భావము

సీ.

శృంగారరసమున జిలుమువోఁ గడిగిన | లలితసువర్ణశలాక యనఁగ,
నమృతాంశుమండ[1]లంబున సానపట్టిన | కమనీయనవరత్నకళిక యనఁగ,
ఘనసారమృగనాభికర్దమంబున దోహ | లం బొనర్చిన తటిల్లతిక యనఁగఁ,
బటు సుధాజలమునఁ బదనిచ్చి చికిలి సే | యించిన వలరాజు హేతి యనఁగ,


తే.

మథ్యమానపయోరాశిమధ్యమమున | నిందిరాదేవి పొడమి, యానంద మొదవ
విశ్వనిర్మాణపరు, నరవిందనాభుఁ | దనర వరియించి, లోకైకజనని యయ్యె.

136


అమృతాపహరణము

చ.

మఱియును దన్మహాజలధిమధ్యమమున్ మథియింపఁగా నిశా
కరుఁడును, గామధేనువును, గల్పమహీచయంబు, దేవతా
కరితురగంబులున్ మొదలుగాఁ గల భవ్యపదార్థజాలముల్
వరుస జనించి మించె ననివారణలీల, ననంతరంబునన్.

137


క.

కరముల నమృతసమన్విత | వరకాంచనకలశ మొకటి వైభవ మెసఁగన్
ధరియించి వెడలె ధన్వం | తరి, తత్సాగరములోన దనుజాధీశా!

138


క.

అంతట సంభ్రమమున ధ | న్వంతరిచేనున్న యమృతవరకలశము వి
క్రాంతమతిఁ గొని [2]దనుక్షే | త్రాంతరమున కేఁగి రసుర లతిరభసమునన్.

139


తే.

జలజలోచనుఁ డపుడు సాక్షాత్కరించి, | నమితకంధరులైన యయ్యమరవరుల
జూచి, మాధుర్యధుర్యవచోనిరూఢి | నతిదయామృత మొలుక ని ట్లనుచుఁ బలికె.

140


సీ.

ఇంద్రాదిసురులార! యింతమాత్రమునకై | చింతింపవలవదు చిన్నవోయి,
[3]యొకక్రమంబునఁ గొని యురవడి దైత్యుల | నాహవక్రీడల నణఁపరాదు,
అయ్యెడునట్టికార్యము గాక మానదు | ప్రాప్తవ్యకర్మంబు ప్రాప్తమగును,
దత్కర్మమును సత్కృతప్రయత్నంబున | ఫలియించుఁ గాలవిపాకసరణిఁ


తే.

గాన, మీరు మనంబునఁ గలఁక యుడిగి | దైత్యు లున్నెడ కరుగుఁ డుత్కంఠతోడ
నంతలోఁ గామినీమూర్తి నవతరించి, | మోహపుట్టించి, వారి నే మోసపుత్తు.

141
  1. లంబను - త,తా,హ,ర,క
  2. దనుజ (?) - మా,హ,క
  3. యేక్రమంబుఁగాని యిరువడ - తి; యేవిధంబుగఁగాని యిరవుడ - తీ; యేక్రమంబునఁగాని యురువడ (యతి?) - మ,హ,ర,క