పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

53


క.

పొందుగఁ గవ్వము చేసి ర | మందభుజాబలము మెఱయ మణిశిఖరాళీ
సుందరము, విభవవిజితపు | రందరము, మనోజ్ఞకందరము, మందరమున్.

114


క.

తరిత్రాడు చేసి [1]రమరా | సురు లురగీజానిఁ జంద్ర[2]చూడపదాబ్జా
[3]భరణపరికీర్తిగామిని, [4]నరనుతసుగుణైకభూమి, నాగస్వామిన్.

115


వ.

ఇవ్విధంబున సకలసాధనసంపన్నులై, మున్నీరుఁ దరువ సమకట్టినసమయంబునం,
బట్టు బిగితప్పి, యప్పర్వతంబు ఘుమఘుమధ్వానంబుతో మునింగిన.

116


క.

దేవాసురు లపుడు క్రియా | కోవిదభావమును, మథనకుధరోద్ధరణ
ప్రావీణ్యముఁ జాలక, ల | జ్ఞావనతముఖాబ్దులైన యవసరమందున్.

117


కూర్మావతారము

మ.

చతురామ్నాయములుం బదాంబురుహముల్, చండాంశు శీతాంశు ల
ప్రతిమానాక్షియుగంబు, పావకుఁడు శుంభద్వక్త్రముంగా రమా
పతి కూర్మాకృతి దాల్చి, యెత్తె వెరవొప్పన్ వార్ధినిర్మగ్నప
ర్వతరాజంబు. సమస్తరాత్రిచరగీర్వాణుల్ ప్రశంసింపఁగన్.

118


తే.

చరమభాగంబునందు వైశాఖనగముఁ | బూని, మీఁదికి నెత్తి, యంబోనిధాన
మధ్యమున నున్న కమఠేంద్రుమహిమ గాంచి, | యద్భుతంబంది సురలుఁ గ్రవ్యాదవరులు.

119


క.

నిజదివ్యజ్ఞానంబున | భుజగేశ్వరతల్పుఁ డగుటఁ బోలించి, కరాం
బుజములు మొగిచి; రమాపతి, | నజు నిట్లని వినుతి చేసి రందఱు వరుసన్.

120


సురాసురకృతవిష్ణుస్తుతి

లయగ్రాహి.

సాధుజనరక్షణ! ధరాధృతివిచక్షణ! వి | రోధిమదశిక్షణ! రమాధర! పయఃపా
థోధికృతవాస! నిరుపాధికవిలాస! మిహి | కాధవళకీర్తి! దివిజాధిపతిముఖ్యా
రాధికశరీర! పరిశోధితవిచార! ముని | బోధఫలసార! విన[5]తాసుతవిహారా
యోధనజితాసుర! పయోధరసుభాసుర! కృ | పైధితమహీసుర! యశోధనవరేణ్యా!

121
  1. రమరాసురలు - అన్ని ప్ర.
  2. జూట - త
  3. భరణత్వకీర్తి - మ,మా,తా,తి,తీ,హ,ర,క
  4. సుర - తి,తీ
  5. యతి?