పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

వరాహపురాణము


ఉ.

యోగ్యతపం బొనర్తు, నని యుత్తమవర్ణుఁడు నిర్ణయించి, వై
రాగ్యమునొంది, [1]చందనధరాధరబిందుసరోవరంబునన్
వాగ్యతుఁడై, సువర్ణమయవారిజకర్ణిక నుండి, నిత్యసౌ
భాగ్యుని, వేద[2]వేద్యునిఁ, గృపానిధి, సంచితభక్తసేవధిన్.

106


తే.

విష్ణు, బ్రభవిష్ణు నిజమనోవీథి నిల్పి, | చండమార్తాండమండలస్థాపితాగ్ర
దృష్టియై చేసెఁ దపమును స్థిరత మెఱయ, | భూరిమారుతపూరకపూర్వకముగ.

107


వ.

ఇట్లు భూసురశ్రేష్ఠుండు తపోనిష్ఠుండై యుండునంత నొక్కనాఁడు.

108


ఉ.

నీరజమిత్రదత్తమగు నిర్మలహారముఁ బ్రేమఁ దాల్చి, యం
భోరుహతుల్యనేత్రరుచిపుంజము దిక్కులఁ బర్వఁ, గిన్నరీ
స్మేరనుతుల్ చెలంగ, యమ[3]సింధువరాదులు గొల్వఁగా, సునా
సీరుఁడు వచ్చె నచ్చటికి శ్రీకరశుభ్రగజాధిరూఢుఁడై.

109


చ.

దివిజవరేణ్యుఁ డిట్లు చనుదెంచి, సరోవరలక్ష్మి లోచనో
త్సవ మొనరింపఁ గన్గొని, నిజద్విపరాజముచేఁ దదంతర
ప్రవిమలహేమపద్మనికరంబు వెసం [4]దివియింప, నల్గి వి
శ్రవుఁడను విప్రపుంగవుఁడు, జంభనిషూదనుతోడ నిట్లనున్.

110


వ.

సురేంద్రా! నీవు రాజ్యమదాతిరేకంబునఁ గన్నుగానక తపోనిష్ణాగరిష్ఠుండనగు నాచే
నధిష్టితంబగు నేతత్కమలషండంబు భవద్వేదండంబుచేతం ద్రెంచివైపించితివి. కావున, నీ
[5]మహైశ్వర్యంబు రాక్షసాక్రాంతం బగుఁగాక! యని శపియించె. అది కారణంబునఁ ద్రిదశ
రాజ్యంబు సాధ్యంబగు. నీవు చతురంగబలయుతుండవై దండయాత్రకుం బ్రయత్నంబు సేయుమనిన తాపసాధ్యక్షునకు, హిరణ్యాక్షుం డిట్లనియె.

111


ఆ.

అమృత మెట్లు పుట్టె? నది రాక్షసుల వల | పించి, చక్రి దేవబృందమునకు
నెట్లు పంచిపెట్టె? నిక్కథ వినుపింపు | మనుడు, మునివరేణ్యుఁ డతని కనియె.

112


క్షీరసాగరమథనము

క.

దనుజేంద్ర! వినుము, దైత్యులు | ననిమిషపుంగవులుఁ గూడి యమృతరసోత్పా
దనమునకుఁ దగిన యత్నము | మనమున నూహించి, విగతమత్సరు లగుచున్.

118
  1. చెందెను - మ,ర,క; చేరెను-హ
  2. మృగ్యుని - త; వంద్యుని - తా
  3. సింధుధరా - మా; సిద్దపరా - ర
  4. దవిలించ - మ,క
  5. మహదైశ్వర్య - మ,మా,తా,తి,తీ,ర,క