పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

51


క.

అమృతరసాస్వాదనమున | నమరత్వము నొంది సౌఖ్య మందిన దివిజుల్,
క్రమమునఁ [1]దావకసాయక | సముదయమునఁ గూలఁగలరు సమరక్షోణిన్.

99


వ.

అది గావున, భవన్నిశితనారాచధారాసంపాతంబున సురశిరస్సరసిజవ్రాతంబుల
విదళించి, త్రిదశేంద్రసింహాసనారూఢుండవై, నాకలోకసుఖంబు లనుభవించి, నక్తంచ
రాన్వయసముద్ధరణం బొనర్పవలయు. ఇది నీకు విజయకాలంబును, సురలకుఁ బరాజయ
కాలంబునుంగా నెఱుంగుము. అది యెట్లనిన.

100


విశ్రవుని వృత్తాంతము

సీ.

పుండరీకం బనాఁ బురరాజ మొక్కటి | పారియాత్రాచలపశ్చిమమునఁ
బ్రాకారగోపురప్రాసాదకలితమై | విలసిల్లు, నందొక విప్రవరుఁడు
విశ్రవుం డనువాఁడు విత్తాభిలాషియై | వెస నగ్రనందను విక్రయించి,
ధనసంగ్రహము చేసి, తద్విత్త మంతయుఁ | గ్రమమున వృద్ధిమూలమునఁ బెనిచి,


తే.

యనుభవింపను, సముచితవ్యయ మొనర్పఁ | జాల కత్యంతలోభియై సంతతంబు
తద్గతస్వాంతుఁడై యుండి, [2]తౌల్యుఁ డనెడి | వైశ్యునకు నాదరంబున వడ్డికిచ్చె.

101


తే.

అంతఁ దద్వైశ్యమందిరాభ్యంతరమునఁ | గల ధనంబెల్లఁ దస్కరాక్రాంతమైన,
విప్రవర్యుండు తద్విత్తవిలయశోక | తాపదందహ్యమానుఁడై తనమనమున.

102


చ.

అనుచితవర్తనంబనక యాత్మజునిం దెగనమ్మికొన్న యా
ధన మది, భోగదానవిహితవ్యయధర్మపరోపకారసా
ధనముగఁ జేయనేరక, వృథామతినై బహువృద్ధిలాభవ
ర్ధనమదపారవశ్యమునఁ దౌల్యున కిచ్చితి నేఁటి కీగతిన్.

103


చ.

విడిముడి గల్గి యోగ్యమగు వెచ్చము సేయని కష్టలోభిచే
పడిన ధనంబు, చోరనృపబాధలఁ బొందక నిల్వనేర్చునే?
జడమతినైతి, భూమిసురజాతి విశిష్టపథప్రచారమున్
గెడసితి, బేలనైతి, విధి గెల్వఁగవచ్చునె యెంతవారికిన్?

104


క.

చోరుల [3]చేపడి నర్థము | చేరునె పలుమారు చింత చేసిన? నిఁక నే
దారసుతవిత్తమోహవి | కారము వర్జించి, యూర్ధ్వగతిఁ బొందుటకున్.

105
  1. దానవ - త
  2. తల్యు - మ,త,తా,తి,తీ,హ,ర,క
  3. చేపడయర్థము - తీ