పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

వరాహపురాణము


సీ.

సర్వలోకాధీక! సనకాదిసేవిత! | పరమయోగారూఢ! దురితహరణ!
కౌస్తుభశ్రీవత్సకలితవక్షస్స్థల! | రమణీయహారవిరాజమాన!
రత్నకుండలదీప్తిరంజితవదనాబ్జ! | మణికంకణప్రభామహితహస్త!
లలితపీతాంబరాలంకృతకటిసీమ! | కరుణాకటాక్షవీక్షణవిలాస!


తే.

బాలభాస్కరకోటివిభాసమేత! | భాగవతలోకమందారపరమపురుష!
పుండరీకాక్ష! గోవింద! పుణ్యనిలయ! | నిన్ను నెప్పుడుఁ దలఁతు మాపన్నవరద!

122


ఉ.

[1]ఆపదనూనవహ్నిహతు లయ్యు, ముకుంద! గుణాభిరామ! నీ
రూపము సంస్మరించిన నరుల్ ధర దైవికభౌతికాదిసం
తాపములం ద్యజించి, వితతంబగు పుత్రధనాదిలాభ ము
ద్దీపితలీలఁ గాంచి, ప్రముదింతురు శ్రీవనితామనోహరా!

123


ఆ.

అనుచు సురలు వొగడ, ననుపమదరహాస | భాసమానవదనపంకజుండు,
హరి విరించిసహితుఁడై పుండరీకాక్షుఁ | డసురవరులకడకు నరుగుదెంచె.

124


మ.

హరి యేఁతెంచిన, దేవదానవులు నిత్యానందసంపన్నులై
ధరణిం జాఁగిలి మ్రొక్కి పల్కిరి, జగత్కల్యాణ! దుగ్ధాంబుధిం
దరువంగా వెర వానతిమ్మనుటయున్, దాక్షిణ్యవీక్షాకృతా
దరుఁడై దైత్యులఁ గొందఱం బిలిచి, పద్మావల్లభుం డిట్లనున్.

125


క.

ప్రారంభించిన కార్యం | బూరక దిగనాడ, సాహసోదారులకున్
దూరమగుఁ గీర్తి, మానం | బాఱదచను, మేలు [2]చేర దపసడి వచ్చున్.

126


ఉ.

కావున మీరు దేవతలకన్న బలాఢ్యులు దైత్యులార! మీ
భావుకబాహుసత్త్వపరిపాకము లోకము మెచ్చ, భోగిరా
జావృతమందరాద్రిఁ గలశాబ్ధి మథింపుఁడు గ్రమ్మరు న్నిలిం
పావళితోడఁ గూడి, హృదయాంబురుహంబుల నుత్సహింపుచున్.

127


ఆ.

మధ్యమానజలధిమధ్యమంబున సుధా | రసము వొడము, నాదరమున మీకు,
నమరసంఘమునకు నది పంచిపెట్టెద | ననుడు, సమ్మతించి యసురవరులు.

128
  1. ఆపదమాని - అన్ని ప్ర.
  2. చారదశసడివచ్చున్ - మ,త,తా; చారదనవడి - మా,తి,తీ; చారదసపడి - హ; చారధసపడి - ర; చితదనపడి - క