పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

వరాహపురాణము


క.

ఆ నరనాయకు లెల్లను | దానవకరతీవ్రఖడ్గదళితాంగకులై
ప్రాణములు విడిచి యమర | స్థానమునకు సంతసమునఁ జనిరి మహాత్మా!

61


క.

నీనామము విని [1]యచ్చటి | భూనాయకు లెల్ల వణఁకి భూధరవిపిన
స్థానంబులఁ జరియింతురు | దానోజ్జ్వలగుణసనాథ! దానవనాథా!

62


శా.

శాకద్వీపముఖాంతరీపములు, రాజద్వైభవశ్రీల న
స్తోకఖ్యాతి వహించి దేవసుజనస్తోమాభిరామంబులై,
యేకాలంబును జూడనొప్పు ఋషభాధీశాత్మజవ్రాత[2]బా
హాకౌక్షేయకశక్తిలాలితములై , యక్షీణభావంబులన్.

63


తే.

అట్టి దీవులకడ నుండు నయుతయోజ | [3]నాయతంబగు బంగారుచాయభూమి
యాధరిత్రికిఁ దుదవంక నమరుఁ జక్ర | వాళశైలంబు సకలదిగ్వ్యాప్త మగుచు.

64


క.

అని భార్గవుండు పలికిన | యనుపమవాక్యముల కలరి, యమ్మునితోడన్
దనుజేంద్రుఁ డనియె వెండియు, | ఘనసమయపయోదనినదగంభీరోక్తిన్.

65


మహాప్రళయవివరణము

ఉ.

ఏగతి నాశ మొందు జగ [4]మింతయుఁ? గ్రమ్మఱ సంభవించు నే
లాగునఁ? దద్విభుండును దలంపఁగ నెవ్వఁడు? సర్వమున్ దయా
సాగర! యానతిమ్మనిన, సంయమివర్యుఁడు, దానవాన్వయ
శ్రీగురుమూర్తి, యాదనుజసింహున కిట్లను సాదరంబునన్.

66


క.

సురరిపువర! విను, షష్ట్యుత్తరశతసాధనసమంచితాఖిలసృష్ట్యా
వరణముల నెద్ది దృగ్గో | చరమగు నది నశ్వరంబు చర్చింపంగన్.

67


క.

కాలము సర్వచరాచర | జాలమునకు నాశకమును జనకంబును, ద
త్కాలంబును వంచింపఁగఁ | జాలఁడు కాలాత్ముఁడైన జలజోదరుఁడున్.

68


తే.

అపరపక్షము వచ్చిన నమృతకరుఁడు | కాలపర్యయమునఁ గళాక్షయము నందు
నట్ల, సమయంబు డగ్గఱ నఖిలజగము | నణఁగు, నది మాన్ప నేరికి నలవి గాదు.

69


వ.

అట్టి జగన్నాశప్రకారం బెట్టిదనిన.

70
  1. యిప్పుడు - క
  2. బాహక్షాయక (ప్రాస?)- మ,త,తా; బాహాక్షాసాయక - తి,హ,ర,క; బాహాకృత్యాయక - తీ
  3. నాయుత - మా,హ,ర; నాయిత - మ
  4. మెల్లను - త