పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

45


క.

సంచితతపఃప్రభావో | దంచితులై దనుజవరులు ధరణీస్థలి జ
న్మించినవేళ, భయంబునఁ | గాంచనశైలంబు బలసి కదలరు దివిజుల్.

55


జంబూద్వీపవైభవము

శా.

ఆభర్మాద్రికి దక్షిణంబున, సహస్రాఖండశాఖావళీ
సౌభాగ్యంబును, యోజనద్విశతకోచ్ఛ్రాయంబునుం గల్గి, [1]యా
శాభద్రేభ[2]తనుప్రమాణఫలపుంజవ్యాప్తమై యొప్పు జం
బూభూజాతము, తన్మహాఫలరసోద్భూతప్రభావం బిలన్.

56


క.

జంబూనది యన వరుణది | గంబుధికిం బర్వెఁ, దన్మహావాహినిలో
నం బరఁగు [3]నిసుము పసిఁడై | జాంబూనదనామమునఁ బ్రశస్తి వహించెన్.

57


క.

తద్విటపియోగమున జం | బూద్వీపం బనఁగ భువనపూజ్యంబై యే
తద్వీప మమరె, భూధర | విద్వేషిప్రార్థనీయవిభవం బగుచున్.

58


వ.

అట్టి జంబూద్వీపంబునఁ గనకశైలంబును, మాల్యవత్కుధరంబును, నిషధభూధరం
బును, వింధ్యవసుంధరాధరంబును, హిమవత్పర్వతంబును, బారియాత్రాచలంబును, గంధ
మాదననగంబు ననం బరఁగు సప్తకులపర్వతంబులును, జిత్రశైలకేతుమాలసంవర్తకాది
కేసరనగంబులును, మలయదర్దురశ్వేతశైలత్రికూటాది ప్రత్యంతభూధరంబులును దేవతాధిష్ఠి
తావకాశంబులై, యతిశీతలద్రోణిప్రదేశంబులై, సకలపుష్పఫలసమంచితంబులై, కిన్నర
కింపురుషగంధర్వాదిదివ్యగణనివాసయోగ్యవనవ్రాతంబులై విలసిల్లు. మఱియును
బవిత్రోదకతరంగపటలీనటీనటనరంగాయమానగంగాయమునానర్మదాచర్మణ్వతీ
సరస్వతీశోణాచంద్రభాగాసరయూప్రముఖనిఖలపుణ్యనదీకదంబంబును, మగధ
మత్స్యకళింగశూరసేనకేరళచోళపాండ్యక్రథకైశికాదిసకలదేశనికురుంబంబును,
నారాయణబదరీశంఖకదళీనిషధాదివిశిష్టాశ్రమసముదాయంబునుం గలిగియుండు.
వెండియు, శ్వేతద్వీపంబు లవణేక్షుమధుక్షీరదధిఘృతసలిలపూరితసప్తసాగరపరీతం
బును, గుశక్రౌంచశాకశాల్మలీప్లక్షపుష్కరద్వీపసమేతంబులును, జతుర్వర్గమూల
కందంబును, సకలజగదానందంబునునై యొప్పు. అందు.

59


ఉ.

ఏలిరి మున్ను దేశము లనేకవిధార్జితపుణ్యులై, మహీ
పాలవరేణ్యు లత్యధికబాహుపరాక్రమనిర్జితారులై,
ఫాలమృణాళహారహిమపారదనారదహీరశారదా
వ్యాళవరాలఘుద్యుతిసమంచితకీర్తివధూవిహారులై.

60
  1. యున్నాభద్రేభ - త
  2. తమఃప్రమాణ - మ,మా,తి,తీ,ర,క
  3. నినుము - మా,ర