పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

43


చ.

కరుణ దలిర్ప నాదివిజకాంతుఁడు సర్వముఁ జెప్పె నాకు వి
స్ఫురితవచోగతిన్, వరుణపుష్కరతీరమనోజ్ఞకుట్టిమ
స్థిరమణిసౌధమధ్యమవిచిత్రహిరణ్మయభద్రపీఠికాం
తరమునఁ జిత్రకేతుముఖధన్యులు గొల్వ సుఖోపవిష్టుఁడై.

41


మ.

అగభిజ్జల్పితవాక్యపద్ధతి, జ్జగద్వ్యాపారమున్, స్వర్గప
న్నగలోకాచలముఖ్యవిస్తరణముం, దత్తత్ప్రదేశోదితం
బగు సత్పుణ్యకథావిశేషసముదాయంబున్, వచోమాధురిన్
దగ నీకు న్వివరించెద న్వినుము, దైత్యస్తోమచూడామణీ!

42


క.

శిఖివాయుజలవియద్భూ | ముఖభూతసమావృతంబు మునిమర్త్య[1]మరు
త్సుఖసంచరణార్హమునై | నిఖిలబ్రహ్మాండఘటము నెఱి నుదయించెన్.

43


ఉ.

అరయ నయ్యజాండమును, హాటకశైలము దేవతాగిరిన్,
మారుతభుగ్విభుండు ఫణిమండలనాథుఁడు, దిక్కరుల్ హరి
ద్వారణసంఘముం, గమఠవర్యుఁడుఁ గచ్ఛపసార్వభౌముఁ, డా
ధారవిశిష్టశక్తియును దాల్చుచునుండుఁ గ్రమక్రమంబునన్.

44


పాతాళలోకసౌభాగ్యము

వ.

అయ్యాధారశక్తియు విలయసమయంబుల బ్రహ్మాండమధ్యగతంబులగు స్వర్గమర్త్య
పాతాళంబుల హరించు. [2]ఆలోకంబులలోనం బాతాళసౌభాగ్యం బెట్టిదనిన.

45


సీ.

సార్వకాలికశుద్ధజలపూరితములైన | హేలాదిపుణ్యవాహినులు గలిగి,
కిసలయకోరకప్రసవఫలోద్దామ | తరుశోభితోద్యానతతులు గలిగి,
ప్రకటసంజీవనాద్యకలంకదివ్యౌష | ధములఁ జూపట్టు శైలములు గలిగి,
ప్రాకారగోపురప్రాసాదమణిదీప్తి | విమలశాఖాపట్టణములు గలిగి,


తే.

రూపలావణ్యగుణముల రూఢి కెక్కు | నవవయఃపూర్ణనాగకన్యకలు గలిగి,
కల్పభూరుహ[3]నవరత్నకామధేను | పుంజములు గల్గి పాతాళభువన మమరు.

46


చ.

ఎఱుఁగరు కామినీపురుషు లెందు వియోగము, దుఃఖలేశముం
బొరయరు, ప్రాణికోటి సుఖపూర్ణత నొంది, భయంబు లేక య
ధ్వరము లొనర్తు రార్యు, లహివర్యవిషాగ్నికి నోడి శాత్రవుల్
చొరరు, హిమోష్ణబాధలును సోఁకవు తద్భువనాధివాసులన్.

47
  1. సముత్సుక (ప్రాస?)- తి, తీ
  2. నాగలోక - తి,తీ,ర; నాక - హ
  3. సురరత్న - త,క