పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

వరాహపురాణము


శా.

సర్వైశ్వర్యకళానిధాననిజరాజ్యసుండవై, యస్మదా
శీర్వాదంబునఁ బుత్ర[1]మిత్రవనితాశ్రీశాలివై, దేవగం
ధర్వాజేయపరాక్రమస్థిరుఁడవై, ధారాళదానక్రియా
[2]వార్వాహప్రతిమానమూ ర్తి వగుచు న్వర్ధిల్లు దైత్యోత్తమా!

34


వ.

అని భార్గవుం డనర్గళాశీర్వచనపూర్వకంబుగాఁ బలికినఁ, గలికినవ్వులేమొలకలు
కపోల[3]పాలికల నందంద కందలింప, నానందిచంద్రికాసందీప్తవదనేందుమండలుం డగుచు,
నాఖండలవిరోధిమండలేశ్వరుం డమ్మునీశ్వరున కిట్లనియె.

35


జగదుత్పత్తిప్రకారనిరూపణము

క.

లోకత్రయంబులోన సు | ఖాకరమగు భువన మెద్ది? యచ్చట దనుజూ
నీకముతో విహరించెద, | నా కెఱుఁగఁగ నానతిమ్ము నయగుణనిలయా!

36


సీ.

ఆధార మెయ్యది - యఖిల లోకములకు? | వారిధిద్వీపవిస్తార మెంత?
తద్ద్వీపములకు నెందఱు రాజముఖ్యులు? | [4]మన కసాధ్యప్రయోజనము లెవ్వి?
కనకాచలాదులఁ గల వస్తుతతి యెద్ది? | వనజాప్తుఁ డేమార్గమునఁ జరించు?
జంభారినగరంబు సాధించు వెరవేది? | యేవేల్పు నాథుండు దేవతలకు?


తే.

రాజితంబుగ నెవ్వనిచే జగంబు | విరచితంబయ్యె? నన్నియు విస్తరించి
తేటపఱపుము నావుడు, దితిజగురుఁడు | హర్ష మందుచు నిట్లను నసురపతికి.

37


క.

భువిఁ బూర్వదైత్యు లడుగని | వివిధరహస్యములు దెలియవేఁడితివి ననున్
భవ[5]దుదితప్రశ్నములకు | వివరింతు సదుత్తరముల విను మసురేంద్రా!

38


చ.

పులహుఁ డనంగ నొక్కమునిపుంగవుఁ డార్యుఁడు, వాలఖిల్యులం
దలఘుఁ డతండు, మున్ను జలజాప్తునియొద్ద నధీతవేదమం
డలుఁడయి, యమ్మహాత్మువలనన్ ద్రుహిణాండజనిప్రకారముం
దెలియనెఱింగి, యాఘనుఁడు దేవపురంబున కేఁగి నేర్పునన్.

39


క.

ఆమూలచూడముగ సు | త్రామున[6]కు నుపన్యసించెఁ దత్కథ మౌని
గ్రామణి, గీర్వాణసభా | సామాజికకర్ణపుటరసాయనఫణితిన్.

40
  1. పౌత్ర - మ,మా,త,తా,తి,తీ,ర,క
  2. దుర్వార (యతి? )- మ,మా,కి,తీ,హ,ర,క
  3. పులకతిలకితంబులై - తీ,ర,మ మా; సుఖస్ఫీతమగు నవకపోల - త
  4. మనుజసాధ్య - త
  5. దీరిత - హ
  6. కెఱిఁగించెనంత - తీ