పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

41


ఉ.

విక్రమశాలి, నయ్యసురవీరుఁ గనుంగొను వేడ్క, నీతినీ
ర్వక్రుఁడు, బుద్ధివైభవనిరాకృతశక్రుఁడు, తత్త్వబోధతీ
క్ష్ణక్రకచాగ్రనిర్దళితసంసృతిచక్రుఁడు, కాంతిధౌతది
క్చక్రుఁడు, రక్షితస్వజనచక్రుఁడు, శుక్రుఁడు వచ్చె నత్తఱిన్.

26


ఉ.

అమ్మునిరాకఁ గాంచి దనుజాగ్రణి, చయ్యన లేచి, యర్ఘ్యపా
ద్యమ్ములు వందనాదివిహితాచరణంబులు చేసి, రత్నపీ
ఠమ్మున నుంచి, యంజలిపుటంబు లలాటమునన్ ఘటించి, వా
క్యమ్ములపద్ధతి న్వినయగౌరవముల్ [1]*గొనసాగ నిట్లనున్.

27


క.

గంగాప్రోతస్విని విక | లాంగునిపై నరుగుదెంచినట్లు, దయాసం
సంగమతి నీవు వచ్చుట | నంగీకృతపుణ్యమూర్తి నైతి మహాత్మా!

28


శా.

నీసామర్థ్యముచేతఁ గాదె రిపుల న్నిర్జించి తత్కాంతలన్
దాసీవర్గముగాఁగ నేలుట, భుజా[2]దండోద్ధతిన్ దిగ్వరా
వాసశ్రేణులు కొల్లలాడుట, జగ[3]ద్వర్ణ్యంబుగా రాజ్యల
క్ష్మీసంపన్నుఁడనై చెలంగుటయుఁ జర్చింపన్ మునీంద్రోత్తమా!

29


ఆ.

నీవు [4]గలుగ మాకు నిఖిలదానవరాజ్య ! వైభవంబు చెడక వన్నెమిగిలి
శత్రురహిత మగుచు శాశ్వతంబై యున్న | దీజగంబులోనఁ దేజరిలుచు.

30


వ.

అనవుడు భార్గవుం డిట్లనియె.

31


ఉ.

తొల్లి నిశాచరేశ్వరులు ధూర్జటితుల్యపరాక్రమోన్నతుల్,
బల్లిదులైన దేవతలఁ బాఱ నదల్చి, సమస్తమేదినీ
వల్లభులైరి, కాని, [5]*జనవర్ణితచారుభవత్సమానసం
పల్లలితప్రభావగుణపారగులే? పరికించి చూడఁగన్.

32


సీ.

శోధించితివి శాస్త్రసూక్ష్మంబులైనట్టి | నీతిమార్గంబులు నేర్పుతోడ,
సాధించితివి [6]జగత్సన్నుతం బగుచండ | భుజదండబలమున భువనతతుల,
బాధించితివి ప్రతాపంబున సురకోటి( | గారాగృహంబునఁ గడిమి నునిచి,
రోదించితివి యప్సరోనికాయము నెల్ల | భవదీయశుద్ధాంతభవనభూమి,


తే.

సంహరించితి వనుపమచక్రవాళ | శైలపర్యంతమేదినీశ్వరకఠోర
బాహువిక్రమగర్వవిస్ఫారమహిమఁ, | గలరె నినుఁబోల నొరులు నక్తంచరేంద్ర!

83
  1. గొనియాడ - మ,తి,తీ
  2. దండాహతిన్ - మ,తా,తి,తీ,హ,ర,క
  3. ద్గణ్యంబు (యతి?) - మ,తి,తీ,హ,ర,క; ద్వంద్యంబు - తా
  4. నేఁడు - తి,తీ,హ; గాక - తా; మాకునెల్ల - క
  5. పర - త; చిర - తా
  6. వీరసమ్మతం-త,మా; సురసన్నుతం - తా