పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

వరాహపురాణము


సీ.

 జ్వాలాకరాళపావకచతుష్టయమధ్య | ధరణిపై [1]నేకపాదమున నిలిచి,
సతతోర్ధ్వభాగప్రసారితబాహుఁడై | సూర్యబింబముమీఁదఁ జూడ్కిఁ జేర్చి,
యాత్మసంయోజితప్రాణుఁడై పవమాన | భోజియై శాంతిప్రపూర్ణుఁ డగుచుఁ,
బార్వతీయుతవామభాగు సర్వేశ్వరుఁ | గరుణామృతాంశు శేఖరుగుఱించి,


తే.

వర్షశీతాతపాదితీవ్రతకు నోర్చి, | నిర్జితేంద్రియుఁడై, [2]మౌననియతిఁ దాల్చి,
త్రిజగదాశ్చర్యభయదచరిత్ర మొదవ, | [3]నుద్ధతాకృతి నొనరించె నుగ్రతపము.

21


వ.

తత్సమయంబున.

22


ఫాలాక్షుని సాక్షాత్కారము

సీ.

ఘనజటాజూటశేఖరితచంద్రద్యుతి | సీమంతమౌక్తికశ్రీల [4]బెరయ,
గ్రైవేయఫణిఫణారత్ననూత్నప్రభ | తారహారజ్యోత్స్నఁ [5]ద్రస్తరింపఁ,
గటిమండలాబద్ధకరటిచర్మచ్ఛాయ | చీనాంశుకచ్ఛవిఁ జిక్కుపఱప,
రమణీయభసితాంగరాగనైర్మల్యంబు | కుచచందనస్ఫూర్తిఁ గూడి నిగుడ,


తే.

వనిత సామేనఁ గలిగిన వన్నెకాఁడు, | భావసంభవు గెల్చిన పరమయోగి,
పూని యొరులకుఁ బొడగానరానివేల్పు, | దానవాధీశ్వరునకుఁ బ్రత్యక్షమయ్యె.

23


హిరణ్యాక్షవరప్రదానము

వ.

ఇట్లు సాక్షాత్కరించిన ఫాలాక్షునకు హిరణ్యాక్షుం డక్షయప్రణామంబు లాచరించి,
నిటలతటఘటితకరకమలపుటుండై, యుదంచితవాక్ప్రపంచంబున వినుతించి, యప్పర
మేశ్వరునివలన దేవమానవభోగిమనోనిక్షిప్తభయంబగు త్రైలోక్యజయంబును, బరిపంథి
జాలహృదయాభీలంబగు శూలంబును, [6]దళితాఖిలదివ్యశస్త్రంబగు పాశుపతాస్త్రంబును, దిర
స్కృతమేరుమహత్త్వంబగు బాహుసత్త్వంబును వరంబులుగాఁ గొని, పునఃపునఃప్రణామము
లాచరించి, సకలసంపన్మందిరంబగు నిజపురంబున కరిగి, భృత్యామాత్యసాంగత్యనిత్యా
నందకందళితమానసారవిందుండై, ప్రాజ్యసామ్రాజ్యవిభవంబు లనుభవించుచు, నొక్కనాఁ
డాత్మభవనదక్షిణద్వారప్రాంగణసభామధ్యమంబున.

24


మ.

ధరణీశుల్ సచివుల్ పురోహితులు గంధర్వుల్ దిగీశాది ని
ర్జరులుం గిన్నరు లప్పరోనికరమున్, జ్వాలాముఖాది క్షపా
చరసైన్యంబును గొల్వ, దివ్యమణిభాస్వద్భర్మసింహాసన
స్థిరుఁడై, భూషణదీప్తి భానురుచి నాక్షేపింపఁ గొల్వుండఁగన్.

25
  1. యందేక - మ,తి,తీ,హ,ర,క
  2. మౌని - త,తి,తీ
  3. నుద్ధురాకృతి - తీ
  4. ఁ బెనయ - హ
  5. బ్రస్తరింప (యతి?) - మా
  6. ధవళితాభీల - తా,మ,మా,తి,తీ,హ,ర,క