పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

వరాహపురాణము

పంచజనావతపట్టణవర్ణనము

క.

పంచజనావతనామో | దంచిత మగుపట్టణంబు, దైత్యుఁడు సంప
ద్వంచితసురపురముగ ని | ర్మించెం, దద్వైభవం బమేయము పొగడన్.

9


సీ.

పరిఖాసమాకీర్ణబంధురమణిమయ | ప్రాకారవలయవిభాసితంబు,
విమలకాంచనకుంభరమణీయగోపుర | ద్వారతోరణజాలవర్ణితంబు,
నసమయప్రసవనేత్రానందశృంగార | వనజాతమారుతవాసితంబు,
రాజమార్గాబద్ధరమణీయకుట్టిమ | పద్మరాగప్రభాభాసితంబు,


తే.

భద్రగజవాజీరథభటభామినీస | [1]మాజదనుజకుమారవిభ్రాజితంబు,
సురగణాపేక్షణీయవస్తుప్రమోద | కరము, పంచజనావతాఖ్యానపురము.

10


చ.

నిరుపమపద్మరాగమణినిర్మితతత్పురహర్మ్యకోటిసు
స్థిరవరహేమకుంభములు తీవ్రతఁ దాఁకి పరిభ్రమించి తే
రురవడి [2]దోరగల్పడిన నొప్పదటంచునొ? దక్షిణోత్తర
స్ఫురదయనాపదేశమునఁ బోవు దివాకరుఁ డబ్దిఁ గ్రుంకఁగన్.

11


చ.

అతులితతత్పురీవిమలహాటకవప్రబహి టాంతిక
స్థితబహుతారకంబులు, తదీయమహాపరిఖాజలంబులన్
బ్రతిఫలితంబులై, యురగపాలకమౌళి సహస్రభాగకీ
లితమహనీయరత్నపటలిం దలపించుఁ బ్రతిత్రియామమున్.

12


చ.

విలసితచంద్రకాంతమణి[3]విశ్రుతతత్పురగోపురంబులం
బొలసిన పూర్ణిమేందుకరపుంజమునన్ జనియించినట్టి ని
ర్మలజలపూరముల్, కడఁగి మంజులహేమమయప్రణాళికా
గళితములై, ప్రపూరములుగా నొనరించు సరోవరంబులన్.

13


ఉ.

రాజితరత్నసౌధగతరాజముఖీముఖలోచనాబ్జవ
క్షోజ[4]కచాదులందుఁ గల సొంపుఁ గనుంగొను వేడ్క మానసాం
భోజమునన్ జనింప, సురముఖ్యులు హేమవిచిత్రపుత్రికా
వ్యాజమున న్వసింతు రనివారణ, దత్పుటభేదనంబునన్.

14
  1. మాజరాజ - త; మాదనుజరాజ మ,తి,తీ,హ,ర,క
  2. వారగల్పడిన - మా; దారకల్ - మ,హ,ర,క; తాదగుల్పడిన - తా
  3. విస్తృత - మా,త,తా
  4. కచాదికౌను - మ,తా,తి,హ,క; కచాదికాంతి - త; కరాబ్జకౌను - క; కచావికాసముల - తీ