పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

క.

శ్రీరమణీనిశ్చలతా | కారణ! సుగుణాభిరామ! కల్పమహీజో
దార! హరినిహితమానస | సారస! కొలిపాక యెఱ్ఱసచివవరేణ్యా!

1


వ.

అవధరింపుము. రోమశమహాముని మార్కండేయున కిట్లనియె. అట్లు జయవిజయులు భూలోకంబున సంభవింప నరుగుటయు, ననంతరంబ యంబుజాక్షుండు దేవమునిగంధర్వాదుల నవలోకించి.

2


మురారి మునిబృందారకబృందము నూరడించుట

తే.

ఏమి కార్యంబు మీర లూహించి కలఁగి | యిటకు వచ్చితి, రత్కార్య మెల్ల ఫలిత
మయ్యె, నిర్భీతులై నిజా[1]యతనములకు | నుత్సుకత నేఁగి వసియింపుఁ డొకటి వినుఁడు!

3


ఉ.

కోపము పాపకారణము గూడిన తద్దురితంబు దుర్గతి
ప్రాపక, మట్లుగావునను బద్మజు నంతటివానికైన రో
షాపనయం బొనర్పక రయంబునఁ గార్యము దీరునే? మన
స్తాపము నొందనేల? భవితవ్యము లయ్యెడు దైవికంబునన్.

4


క.

రాక్షసకుల మణఁచి, భవ | ద్రక్షణ మొనరింతు నని, సురప్రవరులఁ బ
ద్మాక్షుం [2]డూరార్చి, తగన్ | వీక్షాగోచరుఁడు గాక వేగం బరిగెన్.

5


వ.

అంత.

6


హిరణ్యాక్షజననము

క.

జయవిజయులు దితిగర్భా | శ్రయముఁ బ్రవేశించి, రందు జయుఁ డరిభయదు
ర్జయుఁడు, హిరణ్యాక్షసమా | హ్వయుఁడై యుదయించెఁ ద్రిభువ[3]నార్పిత[4]భయుఁడై.

7


శా.

ఈరీతిం బ్రభవించి రాక్షసకులాధీశుండు బాలత్వకౌ
మారంబుల్ [5]తరియించి, యౌవనమదోన్మాదంబునన్ శత్రుసం
హారోదారవిభూతి నొంది, సురకన్యాశ్రేణి సేవింప, జం
భాతిప్రతిమానుఁడై వసుమతీ[6]భాగంబుఁ బాలింపుచున్.

8
  1. లయములకును (యతి?) - తి,తీ,హ,ర,క
  2. డూరార్చియు దగు - తి,తీ,ర
  3. నార్తిత - ర
  4. భరుఁడై - క
  5. ధరియించి - అన్ని ప్ర.
  6. చక్రంబు (యతి?) - తీ