పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

వరాహపురాణము


క.

జననములు మూఁడు మనుజా | శనులై వర్తింపుఁ” డనుచు - శాపము దివిష
న్మునిముఖ్యు లొసఁగి, రత్తఱి | మొనసిన కలకలము వినియె మురభంజనుఁడున్.

169


శౌరి సాక్షాత్కారము

చ.

విని దనుజోగ్ర[1]ఘోషమని వేగమె చక్రము పూని, దైత్యభం
జన మొనరింపఁగా నుదితసంభ్రముఁడై చనుదెంచి, సజ్జనా
వన[2]ధనుఁడైన శౌరి [3]తలవాకిట నిల్చిన, నా రమావిభుం
గనుగొని రింద్రముఖ్యులు, వికాససమంచితనేత్రపద్ములై.

170


చ.

వికసితనేత్రబృంద మరవిందవనంబుగ, హర్షబాష్ప[4]నీ
రకణము లుప్పతిల్లు మకరందముగా, [5]దమమీఁద సారెసా
రెకు హరిమేనిచాయ ప్రసరించుట తేఁటులరాకగా, సుర
ప్రకరము లత్తఱిం గొలనిభావము దాల్చె[6]ను ఘర్మతోయతన్.

171


చ.

పరమయతీంద్రహృద్గుహలఁ బాయక క్రీడ యొనర్చుచుండు నీ
హరి చనుదెంచె, నిప్పుడ రయంబున వీక్షణనీలరశ్మి వా
గురికలచేఁ దగుల్పఱచుకొంద మటంచుఁ దలంచియో సుమీ!
సురపతిముఖ్యు లొక్కమొగిఁ జూచిరి తత్సకలాంగకంబులన్.

172


క.

దివిజేశ్వరాదు లీక్రియ | భువనేశ్వరుఁ గాంచి, హర్షపూరితులై యు
త్సవలీల మ్రొక్కి, వేద | స్తవములఁ గొనియాడి రుదితతాత్పర్యమునన్.

173


తే.

అపుడు జయవిజయు [7]లిరువు రంబుజాక్షు | పదములకు వాలి శాపసంప్రాప్తి శోక
బాష్పధారాసమర్పితపాద్యు లగుచు | హస్తయుగములు మోడ్చి యి ట్లనిరి హరికి.

174


ఉ.

సారసనాభ! మీపనుపు సంతతముం దలమోచి మందిర
ద్వారముఁ గాచియున్న మము వాసవముఖ్యులు ద్రోచి చొచ్చినన్
వారల నడ్డగించితిమి వాక్పరుషత్వముఁ జూపి, మాకు దౌ
వారికధర్మముల్ విడువవచ్చునె స్వామిహితంబు వీడ్వడన్?

175


క.

ఇది తప్పుచేసి త్రిదశులు | సదయత్వము వదలి మూఁడుజన్మంబులు మీ
పదములకుఁ బాసి దైత్యత | నుదయించఁగ శాపమిచ్చి రూరక మాకున్.

176
  1. ఘోషమున - హ,ర,క
  2. తను - తి,తీ
  3. తన - మ,తి,హ,ర
  4. ముల్ నికరణ ముప్ప - మ; నేత్రకణములుప్ప - క ; నీరకణములుప్ప - మా,త; తోయకణములుప్ప - తి,తీ,హ,ర
  5. రమ - తీ
  6. నఘర్మ - అన్ని ప్ర; సమర్మ - మా
  7. లిద్దరునంబు (గణము?) - అన్ని ప్ర.