పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

వరాహపురాణము


పొరపొచ్చెం బొనరింప కేర్పఱతురే? భూరిప్రతాపోగ్రులై
సురవిద్వేషులు సంభవించరు గదా? సూచింపు మబ్జాననా!

153


వ.

అని సాంత్వనపూర్వకంబుగా నిర్వాణపాలనలీలాప్రవర్తిష్ణుండగు విష్ణుం డానతిచ్చిన
దేవకార్యధురంధరయగు వసుంధర యా సింధుర[1]పదున కిట్లనియె.

154


క.

ఆర్య[2]నుతచరిత! సర్వాం | తర్యామికి [3]నీకు నవిదితము లే దైనన్,
ధైర్యం బారయ వచ్చిన | కార్యము వినిపింతు వినుము కరుణాపరతన్.

155


ఉ.

దారుణదైత్యదానవు లుదగ్రబలాఢ్యులు పుట్టి, యిందుకో
టీరవరప్రభావమున డెందమున న్మదియించి, లోకసం
హార మొనర్ప, నిన్గనుటకై సురలందఱు నేఁగుదెంచి, దౌ
వారికు లడ్డపెట్ట నిలువంబడినారు గృహాంగణంబునన్.

156


వాసవాదుల హరినగరప్రవేశము

క.

అని విన్నవించునాలో | సనకాదులు [4]వాసవాదిసకలామరులున్
మునికిన్నరయక్షాదులుఁ | గనుకని హరినగరు చొచ్చి ఘంటావీథిన్.

157


చ.

మణిమయదివ్యగోపురసమాజములున్ భువనేశ్వరంబులున్
బణములుఁ జప్పరంబులు సభాభవనంబులు దివ్యరత్నతో
రణములుఁ బువ్వుఁదోఁటలును రాజముఖుల్ మొదలైన తత్పుర
ప్రణుతవిశేషముల్ నయనపర్వముగాఁ గనుగొంచు నందఱున్.

158


ఇంద్రాదులను జయవిజయులు నిరోధించి బాధించుట

ఉ.

వారిజనాభు శ్రీ[5]నగరు వాసవముఖ్యులు గాంచి, హస్త
కేరుహముల్ లలాటమునఁ గీల్కొనఁజేసి, నిజప్రయోజన
ప్రేరణ నొండొరుం గడచి భీతి విచారము లేక పూర్వది
గ్ద్వారము చొచ్చిపోవుటయు, వారల కడ్డము [6]నిల్చి గొబ్బునన్.

159


చ.

జయవిజయాహ్వయుల్, కనకశైలనిభాంగులు, వేత్రహస్తు, ల
క్షయశుభశంఖచక్రముఖసాధనవంతులు, పుణ్యలక్షణా
దయులు, నిలింపకోటికి ముదంబున నిట్లని పల్కి రెంతయున్
బ్రియము నయంబుఁ బొంకమును బింకము నేర్పడ నుక్తిచాతురిన్.

160
  1. వరదున - తా,ర
  2. సుర - మ,త
  3. నీకభావిత నా కేదైనన్ - తా; 2 నీకు నేదితములే - తి,తీ,హ,ర
  4. నారదాది - తా
  5. నగరి - త
  6. వచ్చి - క