పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

31


శా.

స్పర్ధాకాముకుఁడైన సోమకుఁడు శబ్దబ్రహ్మముం జోరతా
వర్ధిష్ణుండగుచున్ [1]హరించి యరుగన్ వాచాలవీచీలస
ద్వార్ధిన్ దుర్ధరమీనవేషమున నావైరి న్విదారించి, యం
తర్ధైర్యచ్యుతుఁడైన వాక్పతికి నామ్నాయంబు లీవే దయన్?

147


ఉ.

దానవవీరులున్ సురలు దర్పితులై యమృతోదయార్థ మం
భోనిధిఁ దర్చునప్పుడు సముద్రజలాంతరమగ్నమైన మం
థానధరాధరంబుఁ బ్రమదంబునఁ దాల్పవె కూర్మమూర్తివై?
భూనుతభక్తరంజన! ప్రభూతకృపాంజన! దైత్యభంజనా!

148


వ.

అని యివ్విధంబున వసుధావనిత వినుతించిన, [2]నకించిత్పులకకంచుకితగాత్రుం
డగుచుఁ, బుండరీకనేత్రుం డాధరణీతరుణీమణి దిట్టతనంబునం దేనియలుట్టిపడ నొడివిన సుధా
కల్పంబులగు మధురజల్పంబులు చెవులకుం జవులొనర్ప దర్పకలీలాసదనుండును దరహసిత
వదనుండు నగుచు నమ్మగువం జేరందివిచి, జగదీశ్వరుండు సంభ్రమంబున.

149


శ్రీహరి వనుంధరను సాంత్వనపఱచుట

మ.

కరమూలంబుల బాహువుల్ చొనిపి, శృంగారంబు సంపూర్ణకుం
భరుచిం బొల్చు పయోధరద్వయ మురోభాగంబునం దార్కొనం
బరిరంభించి, యుదంచితాధరసుధాపానంబునం దేలి, రా
గరసోద్రేకమునం దదీయసకలాంగస్పర్శనోత్సాహియై.

150


తే.

అంకపీఠస్థలంబున నాలతాంగిఁ | జేర్చి, చిబుకంబు పుణుకుచు సేదదీర్చి,
తత్సమాగమసుఖపరతంత్రుఁ డగుచు | నంబుజాక్షుండు వసుధ కి ట్లనుచుఁ బలికె.

151


సీ.

సుదతులు విరులకై చోఁపిన గమి విచ్చి | పఱచు తేఁటులరీతిఁ గురులు చెదరి,
యస్తమింపగ నేఁగు నమృతాంశుబింబంబు | కైవడి నెమ్మోముకాంతి వెడలి,
రసమింకి కడు [3]వాడి పసచెడు బింబికా | ఫలము చొప్పున మోవిచెలువ ముడిగి,
మొదలి [4]వేరుకుఁ ద్రెవ్వి మురువు దప్పిన పుష్ప | లతలీల మేనివిలాస మెడలి,


తే.

చిన్నఁబా టేర్పడంగ, నాయున్నకడకు | నీవు వచ్చినభావంబు నిర్ణయింపఁ
గార్యమొక్కటి యే దేని కలుగఁబోలుఁ, | దడవు సేయక వినిపింపు తరళనయన!

152


మ.

పరిణామంబె ధరిత్రి నీకు? మఘముల్ పాటింతురే భూసురుల్?
ధరణీనాథులు పాడిమై నడతురే? ధర్మంబు [5]సామాజికుల్

  1. విరించి - తి,తీ,హ,ర,క
  2. నగ్గించిత - క
  3. వాడువారిన (యతి?) - మ,మా,త,తి,తీ,హ,ర,క
  4. వేరును ద్రెవ్వ - త
  5. సామాధికుల్ - అన్ని ప్ర.