పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

వరాహపురాణము


ఉ.

ధీరత నెవ్వఁడేని భవదీయలసద్గుణవర్ణనాసుధా
పూరము జిహ్వికాంజలులఁ బూని, భవాతపజాతదాహమున్
దీరగఁ గ్రోలు, నట్టి మహనీయుఁడు దుర్గతి[1]మార్గదూరుఁడై
చేరును ముక్తిధామ మతిశీఘ్రమున న్విగతప్రయాసుఁడై.

139


సీ.

అమరేంద్రశరణంబు లగు నీదుచరణంబు | లంచితభక్తిఁ బూజించువారు,
నిగమసంస్తుతిపాత్ర మగు నీచరిత్రంబు | వీనులఁ దనియంగ వినెడువారు,
నఖిలలోకాధార మగు నీశరీరంబుఁ | దలఁపున నేప్రొద్దు నిలుపువారు,
నమృతపూర్ణద్రోణి యగు నీగుణశ్రేణి | [2]నిరుపమమతిని వర్ణించువారు,


తే.

దండధరఘోరదండప్రచండపాత | నిర్యదుజ్జ్వలహుతభుగున్నిదవివిధ
లోలకీలాపహతులకు లోను గాక | ఘన[3]త నుందురు నీపురిఁ గమలనాభ!

140


ఉ.

దారుణపూర్వకర్మపటుతస్కరవర్గము లీడ్వ గర్భకాం
తారముఁ దూఱి, సంసరణతాపభయంకరబాధ నొందు సం
సారికి, నీగుణప్రకరసంస్తుతి తద్భయమోచనక్రియా
కారణ మంబుజేక్షణ! జగత్పరిరక్షణ! [4]చక్రలక్షణా!

141


చ.

అలయక సంతతంబు రసనాగ్రమునం భవదీయసద్గుణం
బులు గొనియాడియు న్వినియు మోదమునొందు నరుండు, కర్మశృం
ఖలికలు గోసివైచి యవికారత నీతనువందు డిందుఁ బో!
జలము జలంబులం గదియు చందమునన్ సురబృందవందితా!

142


ఆ.

ఘటపటాదులందుఁ గలుగు జాతి వ్యక్తు | లేర్పరింప వశమె యేరికైన?
నట్ల విశ్వమునకు నఖిలాత్మ [5]యగు నీకు | భేదశంక లేదు వేదవినుత!

143


క.

శంకరుఁడని, త్రైలోక్యవ | శంకరుఁడని, దుష్టరాక్షసప్రవరవినా
శంకరుఁడని, కొల్తురు ని | శ్శంక రహస్యాగమార్థచతురులు నిన్నున్.144
క. అంబుజభవుఁ డాదిగఁ గీ | టం బంతము గాఁగఁ బ్రాకటంబైన ప్రపం
[6]చంబునఁ బరిపూర్ణుఁడవగు| చుం బొల్తువు, నీవు లేని చోటును గలదే?

145


క.

ఈ యఖిలచరాచరమున | నీ యెఱుఁగనియట్టి కార్యనికరం బేదీ?
తోయరుహపత్రలోచన! | యే యెడలం గలవె దైవ మెఱుఁగని పొందుల్?

146
  1. దూరమార్గుఁడై - తి,తీ,ర
  2. నీరూపు మదిని - మ,తా,తి,తీ,హ,ర,క; నిరుపమ మదిని - త
  3. తనుం డగు - త
  4. దుష్టశిక్షణా - త; చక్రరక్షణా - మ
  5. వగునీకు - తా
  6. చంబంతన - త