పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

29


వ.

ఇ ట్లనన్యసామాన్యసంపద్విశేషవిరచితసురచయోత్కంఠంబగు వైకుంఠంబు
గనుంగొని, పురందరాదిబృందారకబృందంబు వందనం బొనర్చె. భూదేవియుం బ్రాగ్ద్వార
ముఖంబున [1]నన్నగరు ప్రవేశించి, హరిమందిరంబు చేరంజని.

132


ధరాదేవీకృతవిష్ణుస్తుతి

సీ.

బహుమణిస్థాపితపాదాంగదమువాని, | జాళువాపసిఁడిపచ్చడమువాని,
[2]నబ్ధిజాకుచచందనాంకవక్షమువాని, | శ్రీవత్ససౌభాగ్యచిహ్నవాని,
హారలతావేల్లితోరుకంఠమువాని, | నవరత్నమయభూషణములవాని,
గండస్థలీచలత్కుండలంబులవాని, | నవ్వులు దొలఁకు నాననమువాని,


తే.

నంబురుహబంధునిభకిరీటంబువాని, | జలధరశ్యామవిగ్రహచ్చాయవానిఁ,
బాంచజన్యసుదర్శనప్రముఖదివ్య | సాధనోజ్జ్వలకరచతుష్టయమువాని.

133


ఉ.

వారిజపత్రనేత్రములవాని, నుదంచితనాభిపంకజో
ద్గారితశారదాధవశతంబులవాని, రమామనోహరా
కారమువాని, సంయమినికాయవశంవదచర్యవాని, ల
క్ష్మీరమణున్, హరిన్, భువనసేవ్యుని, దైవతసార్వభౌమునిన్.

134


క.

వాసవరత్నోత్పన్నవి | భాసముదయభాసమాను, భద్రాసన మ
ధ్యాసీనుఁ జక్రిఁ గాంచె మ | హీసతి యానందభరితహృదయముతోడన్.

135


క.

ధరణీపతి యివ్విధమునఁ | [3]దరణి శతప్రతిము శౌరిఁ దాఁ గని యంతః
కరణమున నలరి యవ్విభు | చరణములకు [4]నెఱఁగి లేచి సంభ్రమ మొదవన్.

136


క.

కరకమలంబులు నిటలాం | తరమునఁ గదియించి, దేవతాగురు లక్ష్మీ
శ్వరు నిఖిలలోకకుక్షిం | భరు హరి, నిట్లనుచుఁ జేరి ప్రస్తుతి చేసెన్.

137


సీ.

దేవ! దేవేశ్వర! దేవారిఖండన! | నిత్య! నిత్యోదయ! నిత్యచరిత!
పద్మజపద్మారిపద్మాప్తసేవిత! | భవహర! భవమిత్ర! భవ్యభవన!
శతపత్రహితశతశతకోటిసంకాశ! | సర్వజ్ఞ! సర్వేశ! సర్వవినుత!
నాగేంద్రనాగారినాగేశవందిత! | కమలాక్ష! కమలేశ! కమలనిలయ!


తే.

చక్రఖండిత[5] సకలారిచక్ర! చక్రి! పరమపదధామ! పరమేశ! పరమపురుష!
నిన్ను సేవింతు సతతంబు నిగమజనక ! | [6]* * * * *

138
  1. నగరంబు - అన్నిప్ర
  2. ఈ పా.ర. ప్ర. లో లుప్తము
  3. ధరణీశ వ్రతము - హ,ర,క
  4. నొరగి- అన్ని ప్ర.
  5. కమలారి - త
  6. అన్ని ప్ర.లో పా. లుప్తము