పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

వరాహపురాణము


చ.

ఎడమకుడింత లేక తను నింపునఁ జేరినవారి భంగముల్
కడలకు [1]నొత్తి, జీవననికాయము [2]పాత్తొనరించి, పాటులం
బడి, యనుకూలుఁడై సరసభావమున న్విహరింప నేర్చు నీ
కడలివిభుండు, సర్వబుధకాంక్షితదానకళా[3]ప్రగల్బుఁడై.

126


వ.

అని పయోనిధానంబుఁ గొనియాడి, తత్సమీపంబునం గనుపట్టు వైకుంఠపట్టణంబు
గనుంగొని దివిజులతో నిట్లనియె.

127


సీ.

గగనమండలనవగ్రహము లీపురికోట | నవరత్నబీజ[4]సంభవములొక్కొ?
గంభీరసప్తసాగరము లీపురిదీర్ఘ | పరిఖలప్రతిబింబసరణులొక్కొ?
మేరురోహణముఖ్యభూరిశైలంబు లీ | పురిగోపురములసోదరములొక్కొ?
రంభాదిసురలోకరాజాస్య లీపురి | భద్రేభయానలప్రతిమలొక్కొ?


తే.

దివిజభూజంబు లీపురిఁ దేజరిల్లు | నిరుపమోద్యానతరువులనీడలొక్కొ?
యనఁగఁ గన్నుల కానందజనక మగుచు | సిరులఁ జెన్నొందుఁ గంటిరే హరిపురంబు?

128


చ.

ఉరమునఁ గౌస్తుభంబు సిరియుం, గటిమండలమందుఁ గాంచనాం
బరమును, వామభాగమున మచ్చయు, నాలుగుచేతులం గదా
సరసిజశంఖచక్రములు సమ్మతిఁ దాల్పనివానిఁ గాన మీ
పురవరమందుఁ జిన్నిమొలపూసల[5]పాపనిఁ బట్టి చూచినన్.

129


మ.

దివిజుల్! పంజరరాజకీరముల నర్థిం జూడుఁ, డిచ్చోట భా
గవతస్కంధకథాసుధామధురవాక్యంబుల్ ప్రసంగింపుచు
న్నవి కర్ణంబుల కింపుగాఁగ, నిచట న్రామాయణగ్రంథమున్
సవిశేషోక్తుల విస్తరించు వినుఁ డాశ్చర్యంబుగా శారికల్.

130


సీ.

జాళువా బంగారుజలపోసనము మంచి | వలువలు గట్టిన వన్నెకాఁడు ,
మిసిమిగాలికి నుబ్బు మెత్తని[6]పరుపుపైఁ | బొసఁగ నిద్రింపని పుట్టుభోగి,
ప్రొద్దుపోకలకైనఁ [7]బులుఁగుతేజీ నెక్కి | వీథులఁ బఱవని వేడ్కకాఁడు,
పొక్కిలివెలిదమ్మిపువ్వునఁ బుట్టిన | తనయుని నెత్తి పెంచని గృహస్థు


తే.

యువతిచెక్కులఁ జన్నుల నొక్క మరియు | మకరికలు వ్రాయ హస్తపద్మములు నాల్గు
గరిమఁ దాల్పక యుండని కాముకుండు | లేఁడు హరిపురిలోనఁ బోలించి చూడ.

131
  1. నెత్తి - తి,తీ
  2. లో సవరించి - మా
  3. ప్రగల్బ్యుఁడై - మ,మా,త,తా,క
  4. సంగమము (యతి?) - ర
  5. పట్టిని వేడ్కఁ జూచినన్ - హ
  6. కడుపుపై - మ,మా,త,తా,హ,ర,క
  7. బులుగులజీ నెక్కి - మ