పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

27


శా.

కంఠేకాలవరప్రభావవిలసద్గర్వాంధులై, సంగరో
త్కంఠాపూరితులై, సమస్తదివిషత్పక్షావనీనాథులం
గుంఠీభావము నొందఁజేసి, యసురల్ గోర్కెన్ సురప్రేయసీ
కంఠాలింగనకాంక్షు లైరి, దితిదుర్గర్భంబునం బుట్టుటన్.

119


క.

బలవంతు లాసురాహితు | లిలఁ బాలింపంగఁ గచ్ఛపేశ్వరఫణిరా
ట్కులనగవరాహదిగ్గజ | ములకున్ మద్భార మతిసమున్నత మయ్యెన్.

120


క.

కావున మనము ప్రియమ్మునఁ | బోవలయను సకలలోకపూజ్యుండగు శ్రీ
దేవుని సన్నిధి కతఁ డసు | రావలిఁ బరిమార్చి భార మంతయుఁ దీర్చున్.

121


క.

పూర్వమున దుష్టదైత్యుల | గర్వాంధులఁ జక్రధార ఖండించి జగ
[1]న్నిర్వాహపరుఁడు గాఁడె? సు | పర్వులు కొనియాడఁ జనఁడె బహుదారంబుల్?

122


చ.

అమరులు నొచ్చినం, దితిసురావలి హెచ్చిన, నగ్నిహోత్రముల్
సమసిన. ధర్మముల్ చెడిన, సత్యము [2]క్రుంగిన, నీతిమార్గముల్
శమితములైన, వేదవిధి జాఱిన, దుర్జను లెచ్చరించినన్
గమలదళాక్షుఁ డీజగముఁ గాచును దా నుచితావతారుఁడై.

123


వ.

అని పలికిన ధరణీతరుణీమణిఫణితిసరణికి నానందించి, పురందరుండు బృందారక
సందోహంబును, సనకసనందనసనత్కుమారపరమయోగివ్యూహంబును, నారదాదిదివ్య
మునులును, రంభాదిసురకామినులును, గంధర్వకిన్నరకింపురుషగరుడోరగనికాయంబును,
సూర్యాదిగ్రహతారకాసముదయంబును గొలిచి చనుదేర, నా[3]భూమిభామినీలలామం
బురస్కరించుకొని, స్వర్గంబు నిర్గమించి చనిచని ముందఱ.

124


దేవబృందముతో నింద్రుని హరిపురప్రయాణము

సీ.

సిరిఁ గన్నతండ్రి, రాజీవనాభుని మామ, | తామరచూలి మాతామహుండు,
శూలి బోనముకుండ, సురల యాఁకటిపంట, | వాహినీతరుణుల మోహభర్త
యమరధాత్రీజంబు లంకురించినపాదు, | చలివెలుంగులవేల్పు జన్మభూమి,
జలధరంబుల పానశాల, రత్నంబుల | గని, శైలముల డాఁగు మనికిపట్టు,


తే.

చేరవచ్చినతఱి నెంతవారినైనఁ | బూని లోఁగొననేర్చిన భువనగురుఁడు
ననఁగఁ, జూపట్టుచున్న దుగ్ధాంబురాశి | గాంచి, దేవేంద్రుఁ డిట్లనుఁ గౌతుకమున.

125
  1. న్నిర్వహణపరుఁడు - మా,త,తి,తీ,ర
  2. కుందిన - త
  3. భూమీలలామం - మ,తి,తీ,హ,ర,క