పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

వరాహపురాణము


మాతాపితృత్యాగమాతంగభామినీ | ఖేలనకాపట్యకిల్బిషముల,
భూతహింసాపుణ్యపురుషపుణ్యాంగనా | [1]దూషణాత్మస్తుతిదుష్కృతములఁ


తే.

బాసి, సురవంద్యుఁడై విష్ణుపదమునందు | మానినులు గొల్వఁ గ్రీడించుమానవుండు,
హరిదినంబున శ్రీమూర్తి నచలభక్తి | యెసఁగ సద్విప్రునకు దాన మొసఁగెనేని.

111


క.

విలసితసాలగ్రామో | పలమూర్తివిశిష్టుఁడైన పద్మారమణున్
[2]దులసీదళములఁ బూన్చిన | ఫలకాముఁడు వాంఛితార్థపటలముఁ జెందున్.

112


ఏకాదశీమాహాత్మ్యము

క.

ఏకాదశి నుపవాసము | గైకొని తులసీదళమునఁ గమలోదరుపూ
జాకృత్యము దీర్చిన నరుఁ | డాకల్పము విష్ణులోకమందు వసించున్.

113


క.

హరిపుణ్యవాసరంబున | నరుఁ డన్నముఁ గుడిచెనేని నలినాప్తసుధా
కరులు గలయంతకాలము | నరకంబులఁ గూలు హితజనంబులతోడన్.

114


చ.

నిరుపమతీర్థసేవయు వినిర్మలధర్మసమార్జనంబు న
ధ్వరకరణంబు నన్నజలదానములుం జరమాశ్రమక్రియా
స్ఫురణము నర్థికామపరిపూర్తియు నాదిగఁగల్గు పుణ్యముల్
హరిదివసోపవాసఫల మందుల వేయవపాలుఁ బోలునే?

115


వ.

అని యివ్విధంబున సురగురుం డుపన్యసించిన సమయంబున.

116


వసుంధర సురేంద్రునిసభ కరుదెంచుట

సీ.

కబరికాభారంబు గమనవేగంబునఁ | గుప్పించి మూఁపునఁ గునిసియాడఁ,
బవననర్తనశిక్ష ఫాలరంగంబునఁ | గుటిలాలకంబులు [3]గొండ్లిసలుప,
గండస్థలంబున ఘర్మాంబుశీకర | జాలంబు మెల్లన జాలుకొనఁగ
సతతనిఃశ్వాసమారుతమున నాసికా | పుటములు పలుమారు పుటములెగయఁ,


తే.

గుచము లల్లాడఁ, బయ్యెదకొంగు జాఱఁ, | గౌను జవ్వాడ, మోవిపైఁ గాంతి వాడ,
లోని తహతహచేష్టలు కానఁబడఁగ | నరుగుదెంచెను భూదేవి యమరసభకు.

117


వ.

ఇ ట్లరుదెంచిన భూకాంత నాలోకించి, దేవతాసమేతుండగు వురుహూతుం డవ్విష్ణు
భామిని నెదుర్కొని ప్రణతుండై, యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, యొక్కహిరణ్మయ
సింహాసనంబు సమర్పించిన, నద్దేవియు నందు నాసీనయై యాసునాసీరున కిట్లనియె.

118
  1. దూషణోన్నతఘోర - తా; దూషణస్తుతి మహా - మ,మా,తి,తీ,హ,ర,క
  2. దులసిం బూజించినఁ దగ - మ; దుళసీరమణుని బూన్చిన - త,మా
  3. గోష్ఠి