పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

25


మ.

హరి యచ్చోటన కాదు, సర్వమునఁ దానై, వాయువార్యద్రిభూ
[1]తరుతేజోవియదంబురాశివిపినస్థానాపగాలోహస
త్పురుషాంతఃపరమాణుముఖ్యములయందుం బూర్ణుఁడై, వీనికిం
బరమాధారమునై వెలుంగుఁ ద్రిజగద్బాహ్యాంతరాళంబులన్.

106


క.

నీయందును నాయందును | బాయక వర్తించునట్టి పరమాత్ముని నీ
వాయత[2]భక్తి భజింపు మ | పాయంబులు గలుగ వెచట బలదనుజారీ!

107


వ.

మఱియు, నా పుండరీకాక్షుని పూజాప్రకారం బాకర్ణింపుము. శిలామయంబును, దారు
మయంబును, లోహమయంబును, [3]లేఖ్యయు, నాలేఖ్యయు, మనోమయంబును, మణిమయం
బును, సికతామయంబు నను నెనిమిదితెఱంగుల ప్రతిమారూపంబులు గలవు. అందులో
నిష్టంబైన విగ్రహంబునందు నావారిజాక్షు [4]నం దావాహించి, యాసనార్ఘ్యపాద్యాచమనీయ
మధుపర్కస్నానవస్త్రయజ్ఞోపవీతదివ్యాభరణగంధపుష్పధూపదీపనైవేద్యతాంబూల
వ్యజనాచ్యుపచారంబులు మంత్రయుక్తంబుగాఁ జేసి, ప్రదక్షిణనమస్కారంబు లాచరింప
వలయు. అట్టి ప్రతిమావిశేషంబులును గ్రామార్చనగృహార్చనభేదంబుల ద్వివిధంబులగు.
అందు గ్రామార్చనరూపంబు చలంబు నచలంబు నన రెండుతెఱంగులు మహోత్సవకాలం
బునఁ బుష్ప[5]3కారోపణయోగ్యంబు చలంబు, స్థావరరూపం బచలంబు ననం బరగు. అట్టి
చలప్రతిమావిగ్రహంబులయందును గృహార్చనారూపంబులయందును దారుమయ సికతా
మయ లేప్యామయ లేఖ్యాలేఖ్యాది రూపంబులయందును బ్రత్యహంబు నావాహనోద్వాస
నంబులు సేయవలయు. అచలప్రతిమలయందును, ధ్యానప్రత్యక్షవిగ్రహంబులయందును,
సాలగ్రామశిలాస్వరూపంబులయందును, మణిమయంబులయందును బరమపురుషుండు
నిత్యసన్నిహితుండు, గావున నావాహనోద్వాసనంబులు సేయంజనదు. ఇట్టి ప్రతిమా
భేదంబులలోన సాలగ్రామశిలామహత్త్వంబు చెప్పెద నాకర్ణింపుము.

108


సాలగ్రామమాహాత్మ్యము

క.

శ్రీమత్సాలగ్రామ | శ్రీమూర్తిని వేదశాస్త్రశిష్టద్విజచూ
డామణికి దానమిచ్చిన | యా మనుజుని సొమ్ము లైహికాముష్మికముల్.

109


క.

సాలగ్రామశిలాప్ర | క్షాళితతీర్థంబుఁ గ్రోలి కమలోదరుది
వ్యాలయముఁ జేరి యెన్నఁడుఁ | గ్రోలఁడువో! నరుఁడు మాతృకుచదుగ్ధములన్.

110


సీ.

బ్రహ్మహత్యాసురాపానగుర్వంగనా | గమనకాంచనచౌర్యకల్మషముల,
సోదరీసంభోగసూనృతరాహిత్య | పరకామినీసంగపాతకముల,

  1. ధర - తా
  2. మతిభజియింపుము - మ,తి,తీ,హ,ర,క
  3. సేవ్యయు - హ,క,ర; నవ్యయు - మా
  4. నందావహించి - అన్ని ప్ర.
  5. కారోహణ - తా,క