పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

23


యందు భేదంబును, హీనబలునియందు దండోపాయంబును బ్రయోగింపవలయు. దండో
పాయంబునకు రథగజతురగపదాతినివహంబును, దనుత్రాణదివ్యాయుధముఖపరికరం
బులును సంపాదించి, గూఢచారముఖంబునఁ బరనృపబలసంపత్తియును, దత్ప్రభుమంత్రో
త్సాహశక్తిప్రకారంబులును, దద్విచారంబు నెఱింగి, గుప్తమంత్రంబునఁ బ్రవర్తింపవలయు.
వెండియు.

90


సీ.

తన మూలబలము నెంతయుఁ బెంచి, యటమీఁద | [1]వలసిన మూఁకలవారిఁగూర్చి,
గుప్తమంత్రవిచారకుశలత, గార్యంబు | ప్రాప్తులతో విచారం బొనర్చి,
తద్విచారంబు నత్యంతగూఢము చేసి, | ప్రకటించి బయట వేఱొకటి చెప్పి,
పరశక్తియును నాత్మబలశక్తియును గాంచి, | కలఁగక తదుపాయగతు లెఱింగి,


తే.

మించివచ్చిన పనులెల్ల [2]మేలుగీళ్లు | దెలిసి, కోపంబువర్జించి, [3]తీవ్రకార్య
సరణి నడువక, పరబుద్ధిఁ గుఱుచపడక | సేయవలయును గురుబుద్ధి నాయకులకు.

91


మ.

గగనం [4]బంటగఁ గోట చేర్చి, పరిఖల్ గంభీరముల్ చేసి, పొం
దుగ నట్టళ్ళును [5]దంచనంబులును దో డ్తో నిల్పి, ధాన్యాదివ
స్తుగణంబుల్ సవరించి, యాప్తసుభటస్తోమంబుఁ గావన్ దృఢం
బగు దుర్గంబున నుండి, భూవిభుఁడు రాజ్యంబేలు టొప్పుం భువిన్.

92


ఉ.

మిక్కిలి శీతలాంబువులు మేనికిఁ గీడు, మహోష్ణవారిచేఁ
బొక్కు శరీర, మీ యుభయముం దొరలించిన నింపొనర్చు న
టోక్కనయంబు నొండె, భయమొండె నొనర్పక, తద్ద్వయంబుఁ
నిక్కువెఱింగి చూపు మనుజేంద్రునకు న్వశు లౌదు రందఱున్.

93


క.

బలవంతుఁడైన విమతుఁడు | కలయక విరసించెనేని ఘనుఁడగు పృథివీ
వలయేశుఁ గూడి తన పగఁ | జలమున సాధింపవలయుఁ జతురుం డగుచున్.

94


క.

అదిగాన ఘోరదైత్యులు | మదవద్రిపుభయదశౌర్య[6]మత్తులు వారిం
గదనమున నోర్వ సురలకు | నిది సమయము గాదు నిర్జరేశ్వర! [7]తలఁపన్.

95


ఉ.

శంభువర[8]ప్రవృద్ధభుజశౌర్యు ల[9]వార్యులు సంగరక్రియా
రంభవిజృంభమాణు లపరాజితకార్ముకబాణు లుగ్రవా
గ్దంభులు దైత్యడింభు లిఁకఁ గాలవశంబునఁగాని నేఁడు వి
శ్వంభరమూ ర్తిచేనయిన సాధ్యులుగారు నిలింపనాయకా!

96
  1. వలనొప్ప వలసిన - త
  2. మేలుగీడు - తీ
  3. విప్రకార్య (యతి?) - మా
  4. బందఁగ - తి,తీ
  5. దెంచనం - తి,తీ,హ; డించనము - త, తా
  6. మంతులు - తా
  7. వినవే - తీ
  8. ప్రసాద - తి,తీ
  9. దైత్యుల - తా; వారిత - క