పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

వరాహపురాణము

సురపతి సురగురువుతో మంత్రాలోచనము

చ.

గరిమ దలిర్ప నిట్లు బహుకాలము దైత్యులు ధాత్రి యేలఁగా
సురపతి యొక్కనాఁడు మణిశోభితసౌధమునందు, దేవకి
న్నరమునియక్షకింపురుషనాగనవగ్రహసిద్ధతారకా
పరివృతుఁడై వసించి, నయభాషల గీష్పతితోడ నిట్లనున్.

83


మ.

హరదత్తోగ్రవరప్రభావమున గర్వాక్రాంతులై రాక్షసుల్
ధరణీనాథుల నొంచి దేవతల నుద్ఘాటించి యాశాధిరా
ట్పురముల్ చేకొనఁజొచ్చి; రా దనుజులం బోనీక దండింపఁగా
[1]గురువైనట్టి యుపాయముం దలఁచి నా కుం దెల్పు మార్యోత్తమా!

84


ఆ.

త్రిదశకార్యనాశ మొదవిన నన్యులు | నిర్వహింపఁగలరె నీవు దక్క?
క్రూరదితికుమారకుల మంతకంతకుఁ | బ్రబలదొణఁగె దివిజభయద మగుచు.

85


చ.

గురువవు, మంత్రి, వాప్తుఁడ, వకుంఠితబుద్ధివి గాన, నిన్ను నా
దరమున వేఁడఁగావలసె, దైత్యుల గెల్చుట యెట్లు? దేవతల్
నిరుపమసాధ్వసంబునఁ జలింపఁ దొణంగిరి, సర్వమంగళా
కరమగు మత్పురంబు గతకౌతుకమై కడుఁ [2]బాడువారెడున్.

86


క.

ఏ కార్యంబున దైత్యులు | శోకంబునఁ బుత్రమిత్రశూన్యాలయులై
యాకలములు దిని కుందుదు, | రా కార్యముఁ దెలిసి నాకు నానతి యీవే!

87


క.

అని యిట్లు దైత్యనాయక | [3]హననోపాయంబు నింద్రుఁ డడిగినఁ, బ్రజ్ఞా
వనరాశియైన సురగురుఁ | డనుకంపాపూరితాత్ముఁడై యిట్లనియెన్.

88


బృహస్పతి దానవవినాశమునకుఁ దెలిపిన యుపాయము

క.

కరుణించి యొసఁగె శంభుఁడు | వర [4]మసురల కది మరల్ప వశమే వాణీ
వరునకు నైనను? గార్యము | వెరవిది యని పలుకరాదు విబుధవరేణ్యా!

89


వ.

మఱియు నీతిమార్గంబు నిజమంత్రులతో మంత్రాలోచనంబు చేసి, కార్యాకార్య మెఱుం
గఁజేసి, స్వామ్యమాత్యసుహృత్కోశరాష్ట్రదుర్గబలంబులను సప్తాంగంబులం గలిగి, సామ
దానభేదదండంబు లనం గల [5]చతురుపాయంబులచేత శాత్రవనాశం బొనర్పవలయు. అందుఁ
గర్తృకారయితృత్వసామర్థ్యసమేతుండై బలవంతునియందు సామదానంబులును, సమబలుని

  1. గుఱుతై - మ,తి,తీ,హ,క,ర; గురుఁడై - మా
  2. బాటు వాటిలెన్ - క
  3. హరణో (ప్రాస?) - మ
  4. మసురుల- తి,తీ,హ
  5. చతురోపాయ - అన్ని తాళప్ర.