పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

వరాహపురాణము


క.

పురుహూతాది దిగీశులు, | నరకిన్నరయక్షదనుజనాగాదులు, నం
బురుహాసనరుద్రాదులు | హరిరూపముఁ దెలియఁ జాల రమలచరిత్రా!

45


మ.

గిరులన్ వృక్షములన్ సరీసృపములన్ - గీర్వాణులన్ వహ్నులన్
ధరణీ దేవతలన్ సముద్రముల మార్తాండావలిన్ యక్షులన్
[1]వరలోకంబుల నాశ్రమంబుల నదీ[2]వ్రాతంబులన్ గోవులన్
హరిరూపంబులుగా నెఱుంగు, [3]మమరాహారోల్లసద్భాషణా!

46


ఉ.

భూరితపోమహత్త్వమునఁ బుణ్యమతుల్ సనకాదులు సం
సారమునన్ దగుల్వడక, సంతతమున్ హృదయాబ్జకర్ణికా
[4]ధారమునన్ సమీరము ను[5]దాత్తత నిల్పి, సనాతనుం జగ
త్కారణు విష్ణు, నాత్మఁ బొడఁగాంతురు నిశ్చలభక్తియుక్తులై.

47


సీ.

ధర్మంబు గళితమై ధరణి నధర్మంబు | పూర్ణమై యభివృద్ధిఁ బొందినపుడు,
గీర్వాణపక్షంబు గీటణంచుటకునై | [6]మించి రాక్షసులు జన్మించినపుడు,
వేదశాస్త్రపురాణవిద్యలు [7]పాషండ | కుల[8]దూషితంబులై పొలియునపుడు,
[9]సభ్యు లెంతయు నొచ్చి సంచరించిననాఁడు, | పుడమిపై బాధలు పొడమినపుడు,


తే.

మహిమ చూపట్ట దుష్టనిగ్రహము చేసి | జగము రక్షించుతలఁపునఁ జక్రపాణి
మత్స్యకూర్మాది బహుమూర్తిమంతుఁ డగుచుఁ | బ్రతియుగంబున [10]జనియించు భవ్యచరిత!

48


సీ.

భువనపావననదీనివహనాయకుఁడగు | నమృతపయోరాశి యాఁడుబిడ్డ,
శృంగారరస[11]1సారజీవకళాలీల | మోహనాంగము గల [12]2ముద్దరాలు,
తెలిదమ్మిరేకులకిలకిలనగుకన్నుఁ | [13]3గోనలఁ గలుముల నీను మగువ,
పద్మసంభవభావభవముఖ్యదివిజసం | ఘాతంబుఁ గడుపారఁ గన్నతల్లి,

  1. పర - తా
  2. ప్రాంతంబులన్ - హ
  3. మధురా - త
  4. ధారమునం దగుల్పడువిధంబు సమీరము - మా
  5. దద్జ్ఞత - మ, తి, తీ
  6. మేటి - తా; మేధ - త; మేద - మ, మా, ర, హ
  7. ధీషండ - మా
  8. భూషితం - అన్ని ప్ర.
  9. ఇది మ. ప్ర. పాఠము; నిజమైనహరిభక్తి త్యజియించి జనులెల్ల వేషధారణులయి వెలయునపుడు - తి, తీ; దుష్టసంకీర్ణమై శిష్టజనోపద్రవము
    సేయు నిమ్మహి వనరునపుడు హ; మా, త, తా, ర, క ప్ర. లో పాదము లుప్తము
  10. జన్మించు-తా
  11. పూర-మా
  12. ముద్దురాలు - మా
  13. గొనలచేఁ గలుముల నొనరుచు సతి - తీ