పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

17


తే.

లక్ష్మియై మించి, వైష్ణవోల్లసితశక్తి | [1]నంది, చిదచిత్స్వరూపుని యనుపమాన
బాహుమధ్యస్థలంబునఁ బాయకుండు | సంతతంబుమ సంయమిసార్వభౌమ!

49


తే.

తిలలఁ దైలంబు పూర్ణమై నిలిచినట్లు, | నిఖిలవిశ్వంబులోపల నిండియుండి,
సర్వమయుఁడైన హరిదేవచక్రవర్తి | జగముఁ బుట్టించు రక్షించు సంహరించు.

50


క.

[2]ఏనెలవున నేరూపము | లో నేనామమునఁ దలఁచు లోలతను జనుం,
డానెలవున నారూపము | లో నానామమునఁ దోఁచు లోలత హరియున్.

51


క.

అణువులలోపల మిక్కిలి | యణువై యాద్యంతరహితుఁ డనఁదగు నారా
యణునిమహత్త్వము, దివిష | గణవల్లభముఖులకైనఁ దరమే తెలియన్?

52


క.

జల[3]*పరిపూరితబహువిధ | కలశంబుల నేకశీతకరుఁడే బహుభం
గులఁ గానవచ్చు కైవడిఁ | బలుతెఱఁగులఁ దోఁచు నాత్మభావరతుండై.

53


వ.

[4]1ఇట్టి పురాణపురుషుండు సర్వపరిపూర్ణుండై జగద్రక్షణంబుకొఱకు మత్స్యకూర్మ
వరాహనృసింహవామనరూపంబుల నవతరించి భూభారంబు మాంచె. ఇంక రామత్రయ
బుద్ధకల్కి[5]వేషంబుల నుదయించి, పాషండరాక్షసాదిదుష్టనిగ్రహం బొనరింపంగలండని
చెప్పిన విని, మార్కండేయుం డిట్లనియె.

54


వరాహావతారకథాశ్రవణకౌతూహలము

క.

ఏదినిమిత్తము విష్ణుం | డాదివరాహస్వరూప మగుటకు? హృదయా
హ్లాదిని [6]యగు నాకథ నా | కాదరమునఁ దెలియ నొడువు [7]మమలచరిత్రా!

55


చ.

అనవుడు రోమశుండు [8]హృదయంబున నుత్సుకుఁడై, మృకండునం
దనునకు నిట్లనున్, మును వినంబడు [9]నట్టిదయైన పద్మలో
చనచరితాంకితంబులగు సత్కథ, లంచితభక్తి నిత్యమున్
వినఁగఁదలంచువారికి నవీనములై యొనరించు సౌఖ్యముల్.

56


క.

కావున, విష్ణుకథారస | కోవిద! [10]సద్వచనహృదయగోచరహరిలీ
లావిర్భావచరిత్రము | వేవిధముల విస్తరింతు విను మెట్లన్నన్.

57
  1. యట్టి - మ,మా,త,తా; యద్ది - హ,ర,క
  2. ఏనెలవున నేరూపున నామమున దలంచితేనియును జనుం డానెలవున నారూపున నానామమునఁ దోఁచు లొలత హరియున్ - మ
  3. పూరితబహుతరమగు - తా
  4. ఇట్లు - తా
  5. దేహంబుల- తి,తీ,హ,ర
  6. యయ్యెం గద - మ,తి,తీ,హ,క,ర; యైతగు కథ- తా
  7. విమల (యతి?)-మ,హ,క
  8. మది నుత్సుకుఁడైన (యతి ) - తీ
  9. నట్టిది-త; నట్టియ దైన - మ,తా,తి,తీ,హ,ర,క
  10. మద్వచన - మా