పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

ప్రథమాశ్వాసము


స్ఫురణములేని కావ్యమును, బూర్ణతలేని తపోనిరూఢి, దు
ష్పురుషుని[1]తోడి బాంధవము పోలిక [2]నిష్ఫలముల్ దలంపఁగన్.

39


క.

హరినామకీర్తనామృత | హరిపదతీర్థంబులాని యతివిమలుండై
హరిభక్తిపరవశుండగు | పురుషుఁడు కైవల్యపదముఁ బొందుట యరుదే?

40


సీ.

తోయజాక్షునిఁబూజ సేయని కరములు | భీకరాఖిలపాతకాకరములు,
హరిమందిరముఁ [3]జేర నరుగని పదములు | యమలోకదుఃఖయాత్రాస్పదములు,
విష్ణురూపంబు భావింపని మనములు | తామసవిక్రియా[4]వామనములు,
దైత్యారిహితముగా దానం బొనర్పని | బహు[5]ధనంబులు దేహబంధనములు,


తే.

అంబుజోదరుసంకీర్తనంబులేని | ముఖము లత్యుగ్రనరకాభిముఖము లింది
రామనోహరచరితదూరంబులైన | దినము [6]లిల దుర్దినంబులు మునివరేణ్య!

41


చ.

నరసురసిద్ధసాధ్యదితినందనముఖ్యులయందు, భారతీ
శ్వరమునిభక్తచిత్తజలజంబులయందును, భూతవాహినీ
తరులతికాదు[7]లం దచలితస్థితి నిల్చి, జగంబుఁ బ్రోచు నా
పురుషుఁ, డతండు లేక తృణముం జరియింపదు, వేయు నేటికిన్!

42


వ.

అట్టి పురాణపురుషుండైన విష్ణుండు ముఖంబువలన బ్రాహ్మణులను, బాహువుల
వలన రాజన్యులను, నూరువులవలన వైశ్యులను, బాదంబులవలన శూద్రులను, జిత్తంబు
వలన శశాంకమండలంబును, నయనంబులవలన భానుమండలంబును, ముఖంబువలన
నింద్రాగ్నులను, బ్రాణంబువలన వాయువులను, నాభివలన నంతరిక్షంబును, శిరంబువలన
నాకాశంబును, బాదంబులవలన భూలోకంబును, శ్రోత్రయుగళంబువలన దిశామండలం
బును, [8]1మేహనంబువలన సముద్రంబులను, గేశచయంబువలనఁ బుణ్యనదీవిశేషంబులను,
నాభికమలంబువలనఁ బితామహుని, ముఖానిలంబువలన దర్వీకరపతంగ[9]2సంఘంబులను,
హర్షంబువలన గంధర్వకింపురుషమన్మథామరకామినీజనంబులను బుట్టించి, రజస్సత్త్వ
తమోగుణసహితుండై, బ్రహ్మ విష్ణు శంకర నామంబులం గలిగి, జగదుత్పత్తి స్థితి లయ
కారణంబై, యపరిభేద్యస్వరూపంబునఁ ద్రిజగద్వ్యాపకుండై వర్తించు. మఱియును.

43


క.

మోహితులై, యజ్ఞానతి | రోహితులై , కమలజాతరుద్రాదులు ల
క్ష్మీహితునిమాయ నత్యుప | గూహితులైనారు, సర్వగోచరచరితా!

44
  1. తోటి - అన్నితాళ. ప్ర
  2. నిష్ఫలమౌ- తీ
  3. బాఱ - హ, ర
  4. దామనములు - మా, త
  5. దేహసంబంధబంధనములు - క
  6. లిట - మ, తా,తి,హ, ర, లవి - క
  7. లందు నుచిత స్థితి - తి, హ, ర, క
  8. మోహంబు - మ, తా, తి, తీ, హ, ర
  9. శంఖంబులను - తీ