పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

18


తే.

పూని [1]మాకుశలప్రశ్నపూర్వకముగ,| ననఘమానస! యేమేమి యడిగి తీవు
తలఁప నవియెల్ల కుశలాన్వితములు సూవె | భవదనుగ్రహవశమునఁ బరమపురుష!

24


క.

[2]హరచరణకమలయుగళీ | పరి[3]చరణార్థంబు రజతపర్వతమున కే
నరుగుచు భాగ్యవశంబున | నిరుపమహరిమూర్తివైన నినుఁ గనుఁగొంటిన్.

25


క.

ఫలితములయ్యెఁ దపంబులు, | గళితము లయ్యె న్మదీయ[4]కల్మషములు, ని
ర్మలితములయ్యె యశంబులు, | కలితములయ్యెం బ్రబోధల్యాణంబుల్.

26


క.

మనమునఁ గల యనుమానము | తనకన్నను ఘనుని నడిగి తద్విమలోక్తుల్
వినినపుడుగాని పాయదు, | మునివర! యొక టడుగవలయు [5]*మును ముఖ్యముగాన్.

27


మార్కండేయమౌని తాత్త్వికసంప్రశ్నము

సీ.

వివిధంబులై మించు వేదార్థములు చూచి | భ్రాంతులై , సహజసిద్ధాంతమార్గ
మిది యని పలుకలే, - రదియును బౌద్ధాది | ఘనవాద[6]పిహితమై కానఁబడదు,
విద్యామదాంధులై వేదాంతవిహితార్థ | మిదమిత్థమని నిర్ణయింపలేక,
యర్థాంతరముఁ జెప్పి - యజ్ఞానపథవర్తు | లై విద్వదభిమాన మతిశయింపఁ,


తే.

దనర బుధులయ్యు నిత్యతత్త్వంబు మఱచి | యాతనాదేహములఁ బొంది యమకఠోర
దండతాడితులై శోకదగ్ధు లగుచు | నుగ్రనర[7]కాలయంబుల నుందు రనఘ!

28


తే.

అట్లు గావున, నిగమంబు లరసి చూచి | యర్థవాదంబు మాని సారాంశ మేర్చి
[8]హృద్వికారహరంబగు హితపథంబు | నాకుఁ దెలుపుము సంయమిలోకవంద్య!

29


సీ.

వేదాంతసిద్ధాంత[9]విమలమార్గంబున | నేకమై విహరించు నెద్దియేని?
స్థావరజంగమాత్మకజగద్ద్వితయంబు | నెందేని [10]వర్తించు నిరవుగాఁగ?
దేని తనుచ్చాయ భానుమండలశత | కోటిప్రభాతతిఁ గుందు వఱచు?
సత్త్వరజస్తమస్సంజాతవికృతులఁ | గడచి వెలుంగు నొక్కటియు నెద్ది ?


తే.

తరువులందును సురలందు నరులయందుఁ | గీటములయందు [11]మునులందు గిరులయందు
సాక్షియై నిల్చు నెయ్యది సంక్రమించి? | యట్టితత్త్వంబుఁ దెలుపుము యతివరేణ్య!

30
  1. కుశలప్రశ్నపూర్వకముగ - మ, మా,హ; పూనిననుఁగుశల - త; పూని కుశలములను - తా
  2. హరి - హ
  3. చర్యార్థంబు - త
  4. కలుషములు - మ
  5. ముదమున మాకున్ - త; మునుకొని నాకున్ - తా; మునివర మాకున్ - హ, ర, క , తి
  6. విహిత - మ, ర
  7. కార్తి నొందుచు - క
  8. దుర్వికారహరంబులఁ దొడరు పదము - క; దుర్వికారహరంబగు హితపథంబు(యతి?) - మ, మా; దుర్వికారంబునందు హితపదంబు - తా; దుర్వికారహరంబగు సద్యోఫలంబు - తీ
  9. విదుల - త
  10. విహరించు - తీ
  11. గిరులందు మునులయందు (యతి?) - మ, త, తి, హ, ర, క