పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

వరాహపురాణము


చ.

పరమపవిత్రము న్వినుతిపాత్రమునైన భవత్పదాంబుజ
స్ఫురితపరాగమాత్ర మిటు సోఁకుటఁజేసి మదీయదేహమున్,
బరిచిత గేహమున్, [1]సుకృతపావనతాపరిణాహ మంది సు
స్థిరత వహించె, నిష్టఫలసిద్ధిఁ దనర్చెఁ దపోవిశేషమున్.

15


క.

భవదంఘ్రికమలదర్శన | భవ[2]సుకృతమహత్త్వ మెన్నఁ బంకేరుహసం
భవునకుఁ, గమలోదరునకు, | భవునకు శక్యంబుగాదు - పరమమునీంద్రా!

16


వ.

అని పలికి వెండియు నిట్లనియె.

17


చ.

సతతము నగ్నిహెూత్రములు సాఁగునె? భూరుహముల్ ఫలించునే?
సితుకునె ధేనువుల్ ? జలగభీరములై చెలువొందునే [3]సర
స్తతులు? సమృద్ధమే విపినధాన్యము? పోషితజంతుజాల మ
ప్రతిహతమే? మృగాద్యసురబాధలు లేవుగదా వనంబునన్?

18


వ.

అని కుశలం బడిగి మఱియు నిట్లనియె.

19


సీ.

శతకోటిశతకోటిసమసమారవములు | దళముగాఁ బర్విన నులికిపడక,
లోకభీకరసముల్లోలకల్లోలసం | ఘము లొత్తి వచ్చిన [4]గండ్లుపడక,
తిమిర[5]సమాభీలతిమితిమింగల[6]వక్త్ర | కుహరమార్గంబులఁ [7]గుంటుపడక ,
భంజనాటోపప్రభంజనాక్షేపంబు | మెండు గాఁ దొణఁగిన బెండుపడక,


తే.

యబ్ధు లేకార్ణవత్వంబు నంది[8]యుండ | భయ మెఱుంగక వటపత్రశయనుఁడైన
విష్ణుఁ బ్రభవిష్ణుఁ జేరి సేవింపుచుందు | వలఘుతరశక్తిఁ బద్మజప్రళయవేళ.

20


క.

[9]బాలకుఁడై మఱ్ఱాకునఁ | దేలెడు హరి నిట్లు గొలువ దివిజావళి ని
న్నాలోకించి నుతించును, | శ్రీలలనారమణ[10]భక్తిశీలుఁడ వనుచున్.

21


క.

కావున, నధ్యాత్మకళా | కోవిదుఁడవు, సకలమౌనికులపతి వరయన్
నీ [11]వచ్చినకతమున, నా | భావము సంతోషవికచభావము నొందెన్.

22


క.

అనవుడు, రోమశమునిపతి | కిని మార్కండేయమౌని [12]కేవలవినయా
వనతుఁడయి దంతకాంతులు | కనుపట్టుచు మెఱయఁ బలికె గంభీరోక్తిన్.

23
  1. బరమ - తీ
  2. సద్గుణసుకృత మెన్న - తా
  3. నదస్తతులు - తి, తీ
  4. గళ్ళు - తీ భిన్నప్రతులు
  5. నామాభీల - తీ
  6. వక్ర - మ, హ, త, తా, తి; సక్ర - తీ
  7. గుండు - తీ
  8. యుండు - అన్నిప్ర
  9. బాలుఁడవై - తా; జాలకుఁడై - మ, మా, తి, హ, ర
  10. భక్త - త, తా, తి, తీ, హ, ర
  11. విచ్చేసిన - హ
  12. కినతి వినయా - మా; కేసరి - త; వినయాన్వితుఁడై తనివొంది దంత - తా