పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

వరాహపురాణము


నయోధ్యానగరంబు మాడ్కి రామ[1]లక్ష్మణాధిష్ఠితంబును, సురలోకంబు కరణి సుమన
స్సంవృతంబును, వారాంగనాసదనంబు క్రియఁ బల్లవాస్పదంబును నై, సజ్జనసమాకీర్ణం బయ్యుఁ
బుణ్యజనదూరంబును, వివిధశాలాన్వితం బయ్యు విశాలంబు నగు రోమశాశ్రమంబుఁ గనుం
గొని [2]ప్రవేశించి యందు.

3


మ.

కనియెన్ సంయమిసార్వభౌముఁడు త్రిలోకఖ్యాతభాస్వద్యశున్,
దిననాథప్రతిమానమూర్తి సుషమా[3]దీప్తాఖిలక్ష్మాదిశున్,
ఘనపంచేంద్రియమత్తవారణఘటాగర్వాపహారాంకుశున్,
వినుతామ్నాయపురాణతత్త్వకలనావిద్యావశున్, రోమశున్.

4


మ.

కని చేర న్మునియుక్తుఁడై యరిగి మార్కండేయమౌనీంద్రుఁ డా
[4]ఘను, నిందూపలవేదికాస్థితు, నమస్కారప్రియాలాపసం
జనితానందునిఁ జేసి, [5]సత్కృతసమర్చాపూర్వకాతిథ్యముల్
గొని, తత్ప్రాంతసమర్పితాసనమునన్ [6]గూర్చుండె మోదంబునన్.

5


వ.

ఇట్లు భాగవతకులాగ్రగణ్యుండును, బరమపుణ్యుండును, మహానుభావుండును నగు
మార్కండేయమహామునిదేవుం డుపవిష్టుండగుటయుఁ దత్ప్రభావంబున.

6


ప్రశాంతపావనవనశోభ

సీ.

ఋతుధర్మములు మాని లతలు భూజంబులు | పూచి కాచి ఫలించి పొలుపు మిగిలె,
నంబుధరాలోకనంబు లేక మయూర | విహగసంఘము పురి విచ్చి యాడెఁ,
బుంస్కోకిలంబు లపూర్వకుహూకార | పంచమ[7]స్వరముల పసలు చూపె,
శ్రుతిసుఖస్వరముల శుకశారికాతతి | హరికథామృతముల నానుచుండెఁ,


తే.

దేనియలు గ్రోలి [8]మదమునఁ దేఁటిగములు | సారఝంకారరవముల సంభ్రమించె,
మఱియుఁ దక్కిన జంతుసమాజమెల్ల | నురుతరానందజలరాశి నోలలాడె.

7


మ.

వనలక్ష్మీధవళాతపత్రములఠేవం బుండరీకావళుల్
గనుపట్టెన్ వికసించి కాంతిగరిమం గాసారమధ్యంబునన్,
ఘనపుష్పోత్థితరేణుపింజరితరంగత్తారకా[9]వీథి త
ద్వనజాతాక్షికి మేలుకట్టుగతి హృద్యంబయ్యె నీక్షింపఁగన్.

8
  1. లక్ష్మణాధిదైవతంబును - తా
  2. ప్రశంసించి - తీ
  3. ధిక్షాఖిలక్ష్మాధిశుం - మ; దీప్తాఖిలక్ష్మాధిశుం - మా; దీప్తాఖిలక్ష్మాధిపున్ - త; దిశ్శాఖిలక్షాధిశున్ - తీ; దిక్ష్మాఖిలక్షాధిశున్ - ర; దిక్ష్మాఖీలాధీశున్ - క
  4. ఘనసింధూఫల - మ, తా, హ, ర, క
  5. తత్కృత- మా
  6. గూర్చుండి - త, తి
  7. స్వనముల - త, తా,హ,ర, క
  8. మదనుని - తి, తీ
  9. రీతి - మ