పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము:

రోమశమున్యాశ్రమమునకు మార్కండేయముని సమాగమము

సీ.

[1]హరిపదాంబుజభక్తిపరుఁడు మార్కండేయ | మునినాయకుం డొక్కదినమునందు,
శాండిల్య పులహ విశ్వామిత్ర గౌతమ | దేవల కౌండిన్య దేవరాత
కశ్యపాత్రి వశిష్ఠ కణ్వాది మునులతో | గౌరీశ్వరుని పదాంభోరుహములు
సేవింపఁదలఁచి, నిజావాసనిర్గతుం | డై, పుణ్యదేశంబు లాశ్రమములు


తే.

నదులుఁ గాసారములుఁ గాననములు గిరులుఁ | గడచి, యెడనెడ సన్మునిగణ మొనర్చు
నాతిథేయాది విహితకృత్యములచేత | హర్ష మందుచు నల్లన యరిగి యరిగి.

1


మ.

విలసత్పంకజకైరవోత్పలవనీవిశ్రాంతభృంగాంగనా
కలసంగీతవిలాసమోహినిఁ, దరంగవ్యూహినిన్, హంస మం
డలకారండవచక్రముఖ్యఖగ[2]రాణ్ణాదామృతోత్సాహినిన్,
జలరాశిప్రియగేహినిన్, గనుగొనెన్ జర్మణ్వతీవాహినిన్.

2


వ.

ఇట్లు గనుంగొని, తత్తీరంబున నవపల్లవకోరకపుష్పఫలసంపత్సమేతచూతపోత
నారికేళపనసవకుళచంపకబిల్వఖర్జూరవటాశోకపున్నాగకురవకతాలహింతాల
సంతానకర్పూరభూరుహకుందమల్లికాదినానావిధతరులతావితానశోభమానంబును,
విమలకమలకుముదసముదయఫుల్లహల్లకబృందనిష్యందమానమకరంద[3]ధారాసార
మిళితకలితజలపూరపూరితకాసారమాలికాసారమృణాలజాల[4]చర్వణగర్వహంసకల
హంసకారండవసారసచక్రవాకబకక్రౌంచముఖకోలాహలముఖరితమధ్యస్థానంబును,
మలయానిలవిహార కమనీయంబును, [5]వకుళమధురసాస్వాదప్రాదుర్భూతమదముదిత
పుష్పంధయబంధురఝంకారరమణీయంబును, జాతివైరదూరజంతుసంతానసమాకీర్ణం
బును బర్ణశాలాంగణవిహరమాణమునికుమారక్రీడాకలాపఘోషపరిపూర్ణంబును, విశాల
తరుమూలపవిత్రాసనసమాసీన[6]పరమయోగీశ్వరతత్త్వవివేచనపరస్పరాలాపసమయ
సముదితవివాదసందిగ్దార్థవిశదీకరణపరిణతరాజకీరశారికాకోకిలకాకలీరవాకలితంబును,
తరుమూలసేచనలీలాలాలసమునిబాలికా[7]లలితంబు నగుచుఁ, బుణ్యవనితావదనంబు
చందంబునం దిలకోజ్జ్వలంబును, బాండవసైన్యంబుతెఱంగున శ్రీకృష్ణార్జునసమేతంబును,

  1. హర - త
  2. రాడ్వాహామృతో - తీ; రాడ్డాహామృతో - హ, ర
  3. ధారాగమకితచలితజలహరిత - తా
  4. రక్షణ - ఘ, తా, హ, ర
  5. మధురమధు - మా, త, తా, తి, తీ, హ, ర
  6. పరమేశ్వరతత్త్వ - తీ
  7. లాలితంబు - తీ