పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

వరాహపురాణము


తే.

అష్టఘంటావధాన విశిష్టబిరుద! | నీవు రచియింపఁ దలఁచిన నిరుపమార్థ
రమ్యమగు నీ వరాహపురాణకావ్య | మంకితము సేయు నాపేర [1]నభిమతముగ.

17


వ.

అని సవినయంబుగాఁ గర్పూరతాంబూల[2]లాలితాంబరాభరణాదు లొసంగిన
నంగీకరించి, యేతత్కావ్యకామినీకర్ణపూరం బగు నయ్యమాత్యశిరోమణి వంశావతారం
బభివర్ణించెద. అది యెట్టిదనిన.

18


కృతిపతి యెఱ్ఱామాత్యుని వంశప్రశస్తి

శా.

వేధః పుత్ర మరీచిసంయమికి నావిర్భూతుఁడై, దైత్యభి
ద్బోధానందసమేతుఁడై, సకలజంతువ్రాతకూటస్థుఁడై,
మేధానిశ్చలుఁడై, జగత్త్రయమునన్ మించెం, దపోయజ్ఞదీ
క్షాధన్యుండగు కశ్యపాఖ్యముని, సాక్షాత్పద్మజుండో! యనన్.

19


ఉ.

ఆమునినాథు గోత్రకలశాంబుధిలోపల నెఱ్ఱమంత్రి పూ
ర్ణామృతధాముఁ డుద్భవము [3]నందె; [4]వినిర్మలకీర్తిచంద్రికా
స్తోమము ధాత్రిఁ బర్వఁగ, బుధుల్ గొనియాడఁగ, శత్రుపద్మముల్
మోములు వంప, బాంధవసముద్రము నిచ్చలు నుబ్బుచుండఁగన్.

20


క.

ఆ సచివశేఖరుఁడు గుణ | భాసురయగు మల్లమాంబఁ బరిణయమై, యు
ల్లాసమునఁ గాంచె బుద్ధి | న్వాసవగురుఁ బోల్పఁదగిన నల్వురు సుతులన్.

21


వ.

వారెవ్వరనిన,

22


సీ.

పన్నగేంద్రశయాన[5]పన్నీరజధ్యాన | సన్నద్ధనిజబుద్ధి చెన్నవిభుఁడు,
కాంతాజనస్వాంతసంతతవిశ్రాంత | కంతుసౌందర్యుఁ డనంతమంత్రి,
పార్వతీశాఖర్వ సర్వజ్ఞతాగర్వ | సర్వస్వనిర్వాహి సర్వఘనుఁడు,
హేమాచలోత్సంగ - ధామావళీరంగ | సీమా[6]నటత్కీర్తి రామశౌరి


తే.

యనఁగ, విఖ్యాతులై మించి రవధికుధర | చరమపరమాంధకారసంహరణకరణ
తరణి బింబాయమానప్రతాపయుతులు , | [7]మఘవపురకామినీగీయమానయశులు.

23


క.

వారల లోపల నగ్రజుఁ | డై రాజిలు చెన్న సైనికాగ్రణి, యక్కాం
బారమణియందుఁ గనియె మ | హారసికుల, బసవవిభు ననంతామాత్యున్.

24
  1. నభినుతముగ - మా, హ
  2. పీతాంబరా-హ
  3. నంద మా; డిందె -త
  4. వినిర్మిత - తా
  5. పదనీరజ - త
  6. నఖత్కీర్తి - మా
  7. మధుర - మా, తి, తీ, హ, ర