పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవతారిక

3


తే.

ఆంధ్రమండల గిరిదుర్గహారలతకు, విమలనాయకరత్నభావము భజించి
యున్నతోన్నతశైలసంపన్న మగుచు, సకలపుటభేదనముల నెన్నికకు [1]నెక్కె.

10


కొలిపాక యెఱ్ఱయ ప్రాభవము

వ.

ఇవ్విధంబునం జూపట్టుచు, విద్వేషిహృదయఘట్టనంబగు నమ్మహాపట్టనంబున
స్థలకరణికాగ్రగణ్యుండై.

11


సీ.

హరినీలనిభదేహనిరుపమచ్ఛాయల యమునాసహస్రంబు లవతరింప
వివిధరాగాస్పద[2]వేణునాదంబున ఘనసుధాజలధి లక్షలు జనింప
లావణ్యపూర్ణలీలాకటాక్షంబుల నంగసంభవకోటు లంకురింప
మోహనకల్యాణముఖవిలాసంబునఁ జంద్రార్బుదంబులు సంభవింపఁ


తే.

గల్పతరుమూలమున గోపికాయుతముగ, మించి క్రీడించు కంబముమెట్టువిభుఁడు
మదనగోపాలుఁ డిలువేల్పు మహిమఁ బ్రోవ, నెలమి విలసిల్లెఁ గొలిపాక యెఱ్ఱశౌరి.

12


క.

సుతనిధి పరిణయదేవా, యతనతటాకోపవనము లనఁదగు షట్సం
తతులు సమకూరె [3]నా కొక, కృతి యందుట యొప్పు ననుచుఁ గృతనిశ్చయుఁడై.

13


చ.

సుతులు హితుల్ పురోహితులు శూరులు ధీరు లుదారులుం గళా
చతురులు మంత్రిశేఖరులు జాణలు గాణలు వారభామినీ
తీవ్రతతులు చేరి కొల్వఁగ సభాభవనాంతరరత్నపీఠికా
స్థితుఁడయి, విష్ణుకీర్తన విశిష్టపురాణము లాలకింపుచున్.

14


క.

శ్రేష్ఠ శ్రీవిష్ణుకథా, [4]గోష్ఠిన్ మధురామృతంబు గ్రోలుచుఁ గవితా
నిష్ఠాద్వితీయదివిజ, [5]జ్యేష్ఠుఁడనగు నన్నుఁ బిలిచి యిట్లని పలికెన్.

15


ఎల్లయ, హరిభట్టు శేముషీవైభవము నభినందించుట

మ.

అమృతప్రాయ[6]వచోవిశేషరచనాహంభావపుంభావవా
గ్రమణీమూర్తివి, వేదశాస్త్రవివిధగ్రంథార్థనిర్ణీతి, వే
కముఖబ్రహ్మవు యాజుషప్రకటశాఖాధర్మధుర్యుండ, వ
ర్యమతేజుండవు, [7]రాఘవార్యహరిభట్టా! సత్కవిగ్రామణీ!

16
  1. నెక్క - తీ
  2. వేణునినాదంబు ఘన - త
  3. నా కిఁక - తా
  4. గోష్ఠీమధురా - త, హ
  5. జ్యేష్ఠుడగు - మా
  6. విశేషకావ్యరచనాహంభావవాగ్రామణీమూర్తివి - మ; యశోవిశేషరచనాహంభావసంభావవాగ్రామణీ - తా; విశేషకావ్యరచనాహంభావవాగ్రామణీ రమణి - తి; విశేషకావ్యరచనాహంభావపుంభావనారమణి - తీ; విశేషకావ్యరచనాహంభావవాగ్రామణీదమసమ్మూర్తివి - హ; విశేషకార్యరచనాహంభావవాగ్రామమూ ర్తివి - ర
  7. రాఘవార్య - తి,హ,ర