పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దేహరమువాఁడు దొంగ నిందితుఁడు రోగి, సోమవిక్రయి కొండీఁడు గ్రామయాచ
కుండు పరపూర్వపెనిమిటి కూలిచదువు, చెప్పువాఁడును శ్రాద్ధవర్జితులు సుమ్ము.

55


క.

మునివల్లభ యీచందం, బునఁ బైతృకవిధులు సలిపి పురుషోత్తమచిం
తన మది మఱవక మెలఁగెడు, ననవద్యుఁడు గాంచు నైహికాముష్మికముల్.

56


క.

అని మార్కండేయుఁడు చె, ప్పిన విని పండ్రెండుసమలు పితృపూజన చే
సినకతన గౌరవక్త్రుఁడు, తనగతజన్మములు నూఱు దలఁచె ధరిత్రిన్.

57


సీ.

తలఁచినజన్మశతంబున నొక్కజన్మము నీకు వినిపింతు నలువ తొల్లి
పరమతత్త్వజ్ఞానవిరహితులై పోయి సుతులు బోధింపంగ సుగతి పొందుఁ
డని శపించినమరీచ్యాదిమానసపుత్రు లేడ్వురలోపల భృగుఁడు గౌర
ముఖుఁడు తద్భృగువంశమున జనించినవాఁడు గాఁగ మార్కండేయమౌనిపుంగ
వుండు దెలిపినఁ దెలిసి పండ్రెండువత్స, రములు పితరులఁ గర్మకాండముఁఁ బూజ
చేసి గౌరముఖుండు ప్రభాసతీర్థ, వాసు దైత్యారి ని ట్లని ప్రస్తుతించె.

58


సీ.

జలజగర్భునిచదువులచెఱవీడ్కోలు మంథానకుధరధురంధరుఁడు
విషధిమునిఁగినవిశ్వంభరకుఁ దేప సుమనోవిపక్షవక్షోవిదారి
కుంభినీనభములు గొలిచినకొలగోల పార్థివరుధిరతర్పణపరుండు
లంకాధిపతితలలకు గండకత్తెర రేవతీహృదయరాజీవహేళి
త్రిపురవనితలయీలువుతెక్కలీఁడు, ఖురఘరట్టవిఘట్టితక్షోణితలుఁడు
చింతితఫలప్రదాత రక్షించుఁ గాత, న న్ననుచు భక్తి రెట్టింప సన్నుతింప.

59


క.

అత్యంతకరుణతో నా, దిత్యసహస్రోపమానదివ్యప్రభతోఁ
బ్రత్యక్షంబై నిలిచిన, దైత్యాంతకుమేన మునివతంసుఁడు గలసెన్.

60


మ.

అనినన్ భూచపలాక్షి యి ట్లనియె జన్యాగ్రంబునం దన్ను గె
ల్చినదుష్టాత్ముఁడు దుర్జయుండు చనఁ బ్రాచీదిఙ్మహీసీమ ని
ల్చినసుత్రాముఁడు నాక మేలుదనుజుల్ విద్యుత్సువిద్యుత్తులున్
సనకాధిస్తుత యేమి చేసిరి పరిస్పష్టంబుగాఁ జెప్పవే.

61


సీ.

అనిన మాయావరాహము చెప్పఁదొడఁగె సునాసీరుఁ డమరసైన్యములు గొలువ
వారణాశికిఁ దూర్పువంక భారతవర్షమున నుండె నవ్వార్త విని ముదంబు
తోడ విద్యుత్సువిద్యుత్తులు జలరాశిగర్భస్థు లైన రాక్షసులఁ గూడు
కొని హిమాద్రిసమీపమున విడిసిరి వారిపై దండు వెడలంగఁ బాకశాస
నుండు దలఁచిన నాంగీరసుండు వచ్చి, శక్ర విద్యుత్సువిద్యున్నిశాటవరుల
యోగవిద్యాసమర్థుల నోర్వలేవు, వేయిగోమేధమఖములు సేయవేని.

62