పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని వాచస్పతి బోధించిన ధేనుసహస్రముల శచీపతి రావిం
చి నియోగించె సరమా, శుని నాగోమేధమఖపశువులం గాయన్.

63


శా.

ఈరీతిన్ వెనువెంట దేవశుని రా నిచ్ఛాగతిం బోయి నీ
హారక్షోణిధరంబుచేరువల మేయన్ గోగణంబున్ సుప
ర్వారాతుల్ గని చెప్ప భార్గవుఁడు కార్యం బాత్మ నూహించి ని
ర్ధారించెన్ బలమర్దనాధ్వరపశుగ్రాహం బవశ్యంబుగాన్.

64


శా.

నిర్ధారించి పులోమజిత్పశువులన్ వేపట్టుఁ డన్నన్ సుర
స్పర్ధు ల్వార్ధులభంగి పొంగెడు మహాసైన్యంబుతో వచ్చి చం
ద్రార్ధోత్తంసునిమామగహ్వరములన్ హంభారవారంభముల్
వర్ధిల్లం బసిఁ బట్టిఁనన్ సమరదుర్వారార్భటుల్ చూపుచున్.

65


క.

వారించిన రాత్రించర, వీరులు మృదువచనరచన వేలుపుఁగుక్కన్
నోరార్చి పాలు వోసిన, వారికి నది పసుల నిచ్చి వచ్చెఁ గడంకన్.

66


సీ.

అరుదెంచి ప్రణమిల్లె నాకుక్క వెనువెంట గోరక్షణార్థము గూఢమార్గ
మునఁ బంపఁ జనిన వేల్పులు నేగుదెంచి మ్రొక్కిరి యింద్రుఁ డప్పుడు సరమఁ జూచి
కటకట పసుల నెక్కడఁ బాఱఁదోలి వచ్చితి చెప్పు మనవుడు శీతనగము
పొంత మేయుచుఁ దప్పిపోయిన ఘోరాటవీభూమి నిందాఁక వెదకి వెదకి
కాన లే నైతి నేనని కల్లలాడ, గూఢచారులు దేవ యీకుక్క వేపి
కడుపు శోధింపు సకలంబు గానవచ్చు, ననిన గోపతి మిగులంగ నాగ్రహించి.

67


క.

ఊళలు వెట్టంగా డా, కాల న్వడిఁ దన్నుటయు భుగాలున నోరం
బాలు వెడల నాసరమయు, జాలి గుడిచి మంచుకొండచక్కికిఁ బోవన్.

68


వ.

పురందరుండును బృందారకవాహినీపరివృతుండై సరమవెంటం జని తుషారగిరి
ప్రాంతకాంతారంబు సొచ్చి మఘవిఘాతహేతువు లైనయాతుధానులం దునిమి
ధేనువులం గొనివచ్చి గోమేధసవనసహస్రంబు సలిపి తత్ప్రభావంబున దుర్వార
బలగర్వంబు పూని మగుడ హిమవంతంబునకు దాడి పెట్టి దానవులం జుట్టుముట్టి
భీమసంగ్రామరంగంబునం గనుపుగొట్టి హతశేషదోషాచరులు విషధిమధ్యంబునం
బడిన విజయలక్ష్మీపరిరంభజృంభణంబున జంభారి నాకపురంబునకుం బోయి హవ్య
వాహనాదిదిక్పతుల వారివారిపురంబుల నిలిపి నిష్కంటకంబుగా రాజ్యంబు చేసె
నీసరమాఖ్యానంబు మానవులు విన్న గోమేధయజ్ఞఫలంబు ప్రాపింతురు వైరుల
చేత రాష్ట్రంబు గోలుపడినభూవల్లభుండు నిర్జననాయకుండుంబోలె వెండియు