పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిజమండలంబున సుఖంబున నుండునని చెప్పిన విని రత్నగర్భసంభవు లైనపదేవురు
దొరలు రాజులై పుట్టి యేమి నామంబులు దాల్చిరి యెవ్విధంబున విహరించిరి
త్రేతాయుగంబున జనార్దనుచేత నేభంగి వరము వడసిరి తెలియ నానతి మ్మనిన
వరాహదేవుం డిట్లనియె.

69


మ.

నలినాక్షీ విను రత్నసంభవులలోనన్ సుప్రభుం డబ్ధికిన్
నెలవోలెన్ శ్రుతకీర్తిభూపతికి జన్మించెం బ్రజాపాలుపే
గ లలాటాక్షకిరీటనాకతటినీరంగత్తరంగాభతుం
దిలకీర్తిప్రభ తోడుగాఁ గృతయుగాది న్మోదసంసారియై.

70


శా.

నానాదేశనరేశ్వరుల్ విగతమానగ్రంథులై మ్రొక్కఁగా
దానక్షాత్రగుణంబుల న్వలని మాద్యత్కుంజరస్యందనా
జానేయాశ్వభటుల్ భజింప మృగయేచ్ఛం దత్ప్రజాపాలధా
త్రీనాథుం డొకనాడు కాననమునం గ్రీడించుచున్ ముందరన్.

71


క.

పావనము సుకృతలక్ష్మీ, జీవనము జనార్దనాభిషేకార్హసరో
జీవనము నొక్కరమ్యత, పోవనము న్వెఱఁగుపడుచుఁ బొడ గాంచి మదిన్.

72


ఉ.

ఇందు మహాతపుం డనుఋషీశ్వరుఁ డొక్కఁడు తత్త్వసచ్చిదా
నందముతోడ నుండుట వినంబడుఁ గావున నమ్మహాత్ముఁ జూ
డం దగునంచు డాసి ముకుటంబు పదాబ్జమునందు మోపఁగా
వందన మాచరించి నిలువ న్మునినాథుఁడు సంభ్రమంబునన్.

73


శా.

ఆశీర్వాదము చేసి యేమి కుశలంబా నీకు నిర్దోషముల్
గా శాసింపుదువా దిగంతములు సౌఖ్యంబుల్ భవత్పాలనా
వైశారద్యమునం గదా నడుచు నిర్వక్రంబులై మాకు ధా
త్రీశా నీసరి చెప్ప రాజనుతు లేరీ ధైర్యసంపన్నతన్.

74


చ.

అని కొనియాడుచున్ సముచితాతిథికృత్యము లాచరించి వ
చ్చినపని యేమి నా నృపతి చేతులు మోడ్చి భవార్ణవంబునన్
మునిఁగెడుమానవుల్ వెడలి ముక్తికిఁ బోయెడిత్రోవ యెద్ది చె
ప్ప నవధరింపు నావుడుఁ దపస్వి మహీశ్వరుతోడ నిట్లనున్.

75


సీ.

అర్చనదానహోమాదులు ఫలకంబు లింద్రియనిగ్రహం బినుపచీల
యఖిలభూతదయాపరాయణత్వము లిపికాఁడు వైరాగ్యంబు గాలిచీర
ధైర్యంబు శుద్ధసత్వగుణంబు మ్రోకులు మంచివారలతోడి మైత్రి సరకు
శీలంబు నడిపించుమాలిమి సంచలింపనిమానసం బడి బరువు గాఁగఁ