పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దేవుఁడవు గావున నిన్ను శరణంబు వేఁడెద నని మస్తకన్యస్తహస్తుండై సంస్తుతిం
చిన సాక్షాత్కరించి పాంచజన్యధరుండు సుప్రతీకవసుధాధ్యక్షుని నిరీక్షించి.

45


సీ.

వర మిత్తు వేఁడుము నరపాలశేఖర నావుడు నతఁడు నానందనులకు
నాకు నీదేహంబునన కూడ వలె నన్న నట్లగా కొసఁగె శ్రీహరి వసుంధ
రాంగనా స్వాయంభువాహ్వయమన్వంతరంబున మొదలియుగంబునఁదు
నేకదేశములోనివృత్తాంత మిది భూరజోంబుధిజలపరమాణుగణము
నైన గణియింపఁగా వచ్చుఁ గాని వినుము, తత్కృతయుగంబులోపలి దైత్యమధన
కృతచరిత్రంబు లన్నియు నెన్నరాదు, వనజభవునకు శతకోటిపత్సరముల.

46


గీ.

అనిన విని కపటకిటితో హరివిచిత్ర, కృత్యములు గౌరముఖుఁడు వీక్షించి పిదప
నేమి గావించె రత్నజు లేమి యైరి, యెవ్వ రమ్మౌని తన్మణి యేడ దనిన.

47


క.

విను విష్ణుమహిమఁ గని ముని, చనియెఁ దదారాధనంబు సలుపఁ బ్రభాసం
బనుసోమతీర్థరాజం, బునకుఁ దపఃఫలదకల్పభూజంబునకున్.

48


క.

చని దైత్యాంతకనామం, బున నచ్చట నున్నవిష్ణుఁ బూజించుచుఁ గ
న్గొనియె నొక నాఁడు ముందట, మనసిజదమనోపమేయు మార్కండేయున్.

49


సీ.

ఇట్లు దూరంబున నీక్షించి యెదురేగి సాష్టాంగ మెఱఁగి నిజాశ్రమంబు
నకుఁ దెచ్చి దర్భాసనంబున నునిచి నానావిధాతిథిపూజనములు నడపి
ముకుళితహస్తుఁడై ముందట నిలిచి మహావ్రత యేమికార్యంబు దలఁచి
యిటకు విచ్చేసితి రెఱింగింపుఁ డనిన నమ్మునివతంసుఁడు గౌరముఖునితోడ
ననియె మీవంటివారిదర్శనమె మాకుఁ, గార్య మింతియ సాందేహికప్రయోజ
నంబు గలిగిన నడుగుము సమ్మతంబు, గాఁగ వచియింతు ననవుడు గౌరముఖుఁడు.

50


క.

పితరులు గల రందురు వే, దతత్వవిదు లైనబుధులు తత్పితరులు వ
ర్ణతతికి సాధారణులో, గతకల్మష మఱియు వేఱె కలరో చెపుమా.

51


సీ.

అనుడు మార్కండేయుఁ డగ్గౌరముఖునితో వినుము విష్ణుఁడు తండ్రి విశ్వమునకు
నాతనివలన బ్రహ్మ జనించె నాబ్రహ్మ ఋషుల నేడ్వుర సృజియించి వారిఁ
గని నన్నుఁ బూజింపుఁ డనిన నాసంయము లాత్మలోపలఁ బరమాత్ముఁ గొలువఁ
గలుషించి వైకారికస్వరూపుఁడు పద్మజన్ముండు మద్వ్యభిచారకారు
లార కాన దురాచారులార కాన, కితవకృత్యంబు లిట్లు చేసితిరి మీరు
బ్రహ్మవిజ్ఞానగర్వంబు పదటిపాలు, గావలయు నంచు ఘోరంబుగా శపించె.

52


గీ.

వార లప్పుడు తనయుల వంశకరులఁ, గని విమానస్థులై నాకమునకుఁ బోయి
తత్సుతులు శ్రాద్ధములు సమంత్రకము గాఁగఁ, దమకుఁ జేయంగ నుండిరి తాపసేంద్ర.

53