పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆచిన్తామణి ముని తన, పీఁచ మడఁచుదాఁక నింకఁ బెనులోభముతో
దాఁచుకొనుఁ గాక నాచే, నీచే నిఁక మోసపోవునే నరపాలా.

17


చ.

అనవుడు రోషరూక్షనయనాంతములన్ వెడగెంపు దోఁప నా
ననకమలంబునం బ్రహాసనస్వనముల్ నిగుడంగ దుర్జయా
వనితల నాయకుండు మదవైరివనీదవనీలు నీలునిం
గని మునిచేతిమానికము గైకొని రమ్మని పంపెఁ బంపినన్.

18


శా.

ఆనీలుండు వరూధినీపరివృతుండై పోయి తేజోనిధిన్
మౌనిం గానికి నైనఁ గైకొనక భీమభ్రూకుటీనాట్యరే
ఖానైపుణ్యము ఫాలభూమి మెఱయంగా యజ్ఞశాలాన్తర
స్థానస్థాపితరత్నరాజము హరించం దేరు డిగ్గె న్వడిన్.

19


వ.

ఇవ్విధంబున రథావతరణంబు చేసి డాసినసమయంబున రత్నంబువలన నిర్యత్నం
బున సపత్నభయంకరంబులై ఘనఘనాఘనశంకాఢ్యంకరణఘీంకరణంబులం గల
సాధోరణంబు లైనవారణంబులతోడ సాదికోలాహలవిశేషితహేషితంబులం గల
రౌద్రసముద్రతరంగంబు లైనతురంగంబులతోడ దశదిశాసంధివిఘటనప్రదితరట
నంబులం గలసవిధకృతరథికమనోరథంబు లైనరథంబులతోడ దుర్వారగర్వప్రబో
ధనసాధనంబులం గలసముద్భటార్భటులైన వీరభటులతోడ జలధరాధ్వరధ్వజ
పటంబులు నటింపఁ జామీకరదండచామరంబులు దూల విచిత్రాతపత్రంబులు
మెఱయ జైత్రవాదిత్రంబులు మొరయ సుప్రభసురశ్మిశుభశుభదర్శనసుకాంతి
సుందరసుద్యున్నుసుశీలసుందసుముఖసుకాంతసోమసుమనశ్శంభుదీప్తతేజోనామధే
యులు పదేవురుదొడలు వెడలి కడలి వెల్లివిరిసినతెఱంగునఁ జతురంగబలంబులు
నడవ సంవర్తసమయసమవర్తులచొప్పున నిప్పులు గ్రక్కుదృక్కోణంబుల దుర్జయ
నృపాలుపడవాలు నీలుం గనుంగొనుచు వానిసేనలమీఁదం గవిసిరి తదవసరంబున.

20


క.

అలిగి హరులు హరులు గజం, బులు గజములు రథములు రథములు భటులు భటుల్
బలువిడిఁ దాఁకిన సైన్యం, బుల రెంట వ్వెడలె నాఱుపులు పెడబొబ్బల్.

21


క.

విపులాసంభూతపరా, గపరంపర లెగసి సైనికక్షతజముచే
నసహృతము లయ్యె బాలా, తపములచే నడఁగునంధతమసము వోలెన్.

22


సీ.

కుప్పలుగా నేనుఁగులు మ్రగ్గె దంతశుండాదండకుంభకర్ణములు దునిసి
వాములుగా వారువంబులు వ్రాలెఁ గంధరవాలమధ్యపాదములు ద్రెవ్వి
ప్రోవులుగా రథంబులు ద్రెళ్ళె రథికసారథిపతాకాకూబరములు నలిగి
గుట్టలుగా బంట్లు గూలిరి బాహుమస్తకపార్శ్వభాగవక్షములు మురిసి