పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాత్మ నూహింపఁగా నుపాయములలోన, నెప్పటికి సామ ముచితంబు నృపవరేణ్య
మౌనిచిత్తంబు రంజిల్ల మంచిమాట, లాడి మణిఁ దెత్తు ననుఁ బంప నవధరింపు.

8


క.

అని తదనుశాసనంబునఁ జని మునిఁ గని మ్రొక్కి మంత్రి సవినయముగ ని
ట్లనియె నొకపదార్థము వేఁడ నృపాలుఁడు నన్ను మీకడకుఁ బుత్తెంచెన్.

9


గీ.

ఋషికులైకవతంస నిస్పృహుఁడ వైన, ని న్విచారించుకొని మేదినీజనావ
నానుభావధురంధరుం డైనదుర్జ, యుని విచారించి దయతోడ నొసఁగవలయు.

10


క.

అనవుడు మునినాయకుఁ డి, ట్లనియె నృపతి నిన్నుఁ బంపునఁట వినుము విరో
చన పరులకు నది యీవ, చ్చిన నిచ్చెద దాఁచ నేల చెప్పు మటన్నన్.

11


వ.

వశీకృతనయకళాపాండిత్యుం డైనదుర్జయనృపామాత్యుండు హస్తంబులు మొగిచి
మహాత్మా నిన్న మృగయాపరిభ్రమంబున నలసి వచ్చిననన్ను నేకాక్షోహిణిబలంబు
నిలిపి యేపదార్థంబును సంపాదింపరాని యిట్టినట్టడవిలోనం జిట్టమిడిచినమాత్రం
బున విచిత్రంబుగా నానావిధపదార్థంబు లేరత్నంబువలన సంపాదించి రాజోప
చారంబుల నతిథిసత్కారంబు సలిపితిరి తద్దివ్యరత్నంబు కృపసేయవలయు నని
మారాజు దేవరకు విన్నవింపు మని నన్నుం బుత్తెంచె నన్న సన్నంపునవ్వు నివ్వ
టిల్ల గౌరముఖుండు విరోచనుఁ గనుంగొని చతుర్ముఖునిముఖంబున జన్మించిరి
గావున బ్రాహ్మణులకు వేఁడుటయు భుజంబులం బుట్టిరి గావున రాజులకు నిచ్చు
టయు ధర్మంబు మది నిది విచారింపక బ్రాహ్మణుల రాజులు వేఁడుట విపరీతంబు
యథార్థంబు చెప్పెద నదియునుం గాక వైషవం బైనరత్నంబు మాకు వెచ్చపెట్ట
శక్యంబు గాదు నీదు వాక్యంబులు విన రాదు కాదు కూడ దని వాదునకుం జొరక
వచ్చి తడవాయె విచ్చేయు మని సోల్లుంఠంబు లాడిన.

12


గీ.

మంత్రి యిట్లను మీకు నేమములు హోమ, ములు జపంబులుఁ దపములుఁ బొనుఁగుపడక,
నడచు నెవ్వానివలన నన్నరవరుండు, వేఁడ మణి యీక కడపుట వెఱ్ఱితనము.

13


క.

అనవుడు రోషారుణలో, చనుఁడై గౌరముఖమౌనిసత్తముఁడు విరో
చనుఁ జూచి బొమలు నటియిం, ప నిజక్షమ చెదర నదరిపడి యిట్లనియెన్.

14


ఉ.

దుష్టచరిత్రు లైననృపతుల్ ధర యేలుటకంటెఁ గల్గు నే
కష్టము శిష్టలోకము సుఖస్థితి నుండదు గాన నిట్టిష
ష్టాష్టక మెట్టు పుట్టె నకటా వికటాలపితంబు లేటికిన్
భ్రష్ట పొకాలి పొ మ్మనుచుఁ బల్కిన నుల్కినమానసంబునన్.

15


గీ.

మరలి యేతెంచి మంత్రి దా మంచిమాట, లాడినవిధంబు మునికులాధ్యక్షుఁ డాగ్ర
హించి పల్కినచందంబు నేర్పడంగ, విశ్వభూతలభర్తకు విన్నవించి.

16