పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఋభువిభునిభుఁ డాభూవ, ల్లభుఁడు నిజాంగనలు తనువలగ్నలు విద్యు
త్ప్రభయుం గాంతిమతియు నను, శుభలక్షణవతులు సతులు సుతులం గనమిన్.

175


క.

పట్టె ననేకవ్రతములు, పెట్టె మహీదేవులకు నభీష్టాన్నంబుల్
కట్టె నుపవాసములచే, మెట్టెం బుణ్యస్థలములు మెలఁతలుఁ దానున్.

176


క.

ఈభంగి నడువఁ దనకుఁ దనూభవ సంప్రాప్తి లేమి నొచ్చి తపశ్చ
ర్యాభిరతిన్ సచివులపై భూభారము నిలిపి కదలిపోవుచు నెదురన్.

177


ఉ.

నాటినభక్తిపాటవమునం గనియెం బితృకూటమున్ గుహా
కోటరకుంజపుంజగతకుంజరఝాటము శాబరీకృతా
ఖేటము నిష్ఠురాఘశరఖేటము దివ్యమణిప్రభానిరా
ఘాటము నిర్ఝరీలహరికంకణకోరకితార్కఘోటమున్.

178


క.

కని తద్గిరిగహనాంతరమున దూర్వాసుని సమస్తమునిలోకవతం
సునిఁ గూర్చి సుప్రతీకా, వనిపాలుఁడు దపము సల్ప వాత్సల్యమునన్.

179


సీ.

అనుభావశక్తి బ్రహ్మాదుల నొకపూరిపుడకకుఁ గైకోనిపోతరీఁడు
ఘనకోపవాణిజ్యమునఁ దసోవి త్తజాలముఁ గూడఁబెట్టెడులాబగాఁడు
తనరథంబునకు మాధవసత్యభామల గుఱ్ఱాలఁ జేసిన కోడిగీఁడు
యతిసతీకులరత్న మనసూయకడుపున మునుమునఁ బుట్టినముద్దులాఁడు
సకలకళ్యాణకరుఁడు సాక్షాధనంగ, హరుఁడు నిర్మలతత్త్వవిద్యావిచార
ణావిలాసుఁడు దూర్వాసుఁ డావసుంధ, రాధిపతికి వరంబు లీ నరుగుదెంచె.

180


వ.

తదనంతరంబున.

181


ఉ.

లేఖులు రెండువంకల బళీబళిశద్దపరంపరల్ మహా
మౌఖరి నుచ్చరింప మదమత్తనిశాటవిపాటనైకవి
ద్యాఖరదంతకుంతభయదాభ్రమువల్లభు నెక్కి రేవతా
శేఖరుఁ డింద్రుఁడున్ వనవిశేషము చూచుచు వచ్చి ముందటన్.

182


క.

అనవద్యుని దుర్వాసో, మునిఁ గని యేనుంగు డిగక మ్రొక్కక పార్శ్వం
బున నిలిచె నగుచు నూరక, తనుఁ జెఱుపఁగ నెత్తుకొన్న దర్పముకతనన్.

183


క.

ఆమఘవంతునిరాజ్య, శ్రీమదగర్వంబు చూచి ఘృతధారలఁ బై
పై మండునగ్ని వోలె మ, హామునిహర్యక్షుఁ డాగ్రహవ్యగ్రుండై.

184


క.

నిటలంబునఁ గుటిలభ్రూ, కుటి నటియింపంగ మొగ మిగుర్పఁగ మేనం
జొటజొటఁ జెమటలు గాఱఁగఁ, గటమర లదరంగ నౌడు గఱచుచుఁ బలికెన్.

185