పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అనుకంప లేక బ్రాహ్మణుని నమ్మించి గొంతుకఁ గోసిపోయినదోసకారి
గౌతమఋషికులాంగన నహల్యాదేవిఁ జీఁకటితప్పు చేసినదురాత్మ
పరసతిబిడ్డని హరకోపహుతవహార్చులలోనఁ ద్రోచిన క్రూరకర్మ
సగరక్షమాపాలసప్తకంతువిముక్తహరి ముచ్చిలించినపరమధూర్త
యోరి గోత్రవిఘాతి న న్నొకతపస్వి, మాత్రుఁగాఁ జూచి యిపుడు నమస్కరింప
వైతి గావున దేవరాజ్యాధిపత్య, మునకుఁ బెడఁబాసి భువిఁ గూలు మని శపించి.

186


శా.

అంతన్ శాన్తి వహించి సస్మితముఖుండై సుప్రతీకక్షమా
కాంతుం జూచి పులోమజిద్విజయయదీక్షాదక్షుఁ డక్షుద్రుఁ డ
త్యంతక్రూరుఁడు దుర్జయాఖ్యుఁడు నరేంద్రా నీకు విద్యుత్ప్రభా
కాంతాగర్భమునందు నందనుఁడు లోకఖ్యాతిగాఁ బుట్టెడున్.

187


వ.

అని వరం బిచ్చి దీవించిన మునికి మ్రొక్కి సుప్రతీకుండు చనియె నని వరాహ
దేవుండు చెప్పిన ధరావరారోహ తరువాతివృత్తాంతం బానతి మ్మని విన్నవించిన.

188


మ.

తటినీనాధగభీర పార్వికసుధాధామప్రభాధామ వా
క్పటిమాంభోరుహగర్భ విభ్రమవతీపాంచాల ధాటీరజః
వటలాంధీకృతరోదసీకుహర శుంభత్కీర్తిసంపన్న ది
క్తటవేదండఘటావిభక్తచతురాఘాటావనీమండలా.

189


క.

ప్రాజ్యభుజభుజగసన్నిహి, తజ్యశరానలహుతాహితక్షితిపతిర
క్తాజ్య నరసింగనృపసా, మ్రాజ్యరమాధరణ సుకవిరాజోద్ధరణా.

190


తోటకవృత్తము.

కుకురుప్రమదాకురుకుంభకుచా, శకనీలకచాకరచాలితహా
టకచామరకేళినటచ్చికుర, ప్రకటాచలచుంబితఫాలతలా.

191

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వర ప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబున ద్వితీయాశ్వాసము.