పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

స్వామీ నన్ను ననుగ్రహింపుము జగజ్జాలంబు లెల్లన్ భవ
త్సామర్థ్యంబునఁ బుట్టు నుండు నడఁగున్ సంత్రాసదం బైననీ
యీమీనాకృతి మాను మాదిమతనూపేతుండవై శాంతిల
క్ష్మీమాధుర్యము చూపు మంచు వినుతుల్ సేయంగ మోదంబుతోన్.

167


ఉ.

ఆపరమస్తుతుల్ వినుచు నంబునిమగ్నము లైనవేదశా
స్త్రోపనిషత్ప్రపంచముల నున్నతశక్తి ననుగ్రహించి ల
క్ష్మీపతి లోకభీకరతిమింగిలరూపము మాని తాల్చె నా
నాపురుషార్థదాయక మనంగ వెలింగెడుపూర్వరూపమున్.

168


గీ.

కావున మహాత్ముఁ డతఁడు సాకారుఁ డగుచు, నిలుచు నెందాఁక నందాఁక నిలుచు నీస
మస్తజగములు కూటస్థుఁ డైన నడఁగు, వికృతిగతుఁ డైన మగుడ నావిర్భవించు.

169


సీ.

మేదిని నీరీతి నాదిదేవుండు కల్పించి కల్పనము చాలింప జగము
వృద్ధిఁ బొందుచునుండ నింద్రాదివిబుధులు హరిఁ గూర్చి బహుకాల మధ్వరములు
మొదలుగాఁ గలధర్మములు సప్తసాగరవేలాపరీతపృథ్వీతలమునఁ
గావించుచో ననేకసహస్రవక్త్రనేత్రోదరబాహుఁడై రొదసీక
టాహమధ్యంబు నిండిన దేహయష్టి, మెఱయ సాక్షాత్కరించి లక్ష్మీమనోహ
రుండు దేవతలార కోరుండు మీకు, నే వరంబులు వలసిన నిత్తు ననిన.

170


గీ.

దేవ నినుఁ గాని మమ్ము ధాత్రీతలంబు, వారు పూజింప నొల్లరు వారిచేతఁ
బూజగొన మాకు వర మిమ్ము తేజ మిదియ, నాఁగ నిచ్చితి నంచు నంతర్ధి నొందె.

171


గీ.

అంత సంతోషమున మహేంద్రాదివిబుధ, వర్గములు పోయె నాత్మనివాసములకు
శార్ఙ్గపాణియు సత్వరజస్తమోగు, ణములఁ ద్రివిధంబు లైనభావములఁ దాల్చి.

172


వ.

సాత్వికం బైనభావంబున నిజావయభూతపురుహూతప్రముఖలేఖుల నారాధించె
రాజసం బైనభావంబున మకారస్వరూపియు నాత్మీయరజోమూర్తియు నగుశూల
పాణి భక్తిం బూజించెఁ దామసం బైనభావంబున రాక్షసులం బ్రవేశించె నిత్తెఱం
గున జగత్కర్త మూడువిధంబులం బొందిన నది మొదలుగా లోకంబును మూడు
విధంబులం బొందె వెండియుఁ ద్రిమూర్త్యాత్మకం బైనదేవుండు కృతయుగంబున
నారాయణుండును ద్రేతాయుగంబున రుద్రాకారుండును ద్వాపరయుగంబున
యజ్ఞమూర్తియుఁ గలియుగంబున బహురూపధరుండును నయ్యె నట్టివిష్ణునిమహ
త్త్వంబును విష్ణుభక్తులచరిత్రంబును విచిత్రంబుగా వచియింతు నాకర్ణింపుము.

173


క.

కృతయుగమున వేలాపరి, వృతనిఖిలక్షోణివలయభృతిలీలాధి
క్కృతసుప్రతీకుఁ డగుసుప్రతీకుఁ డను రాజు గలఁడు రాకేందుముఖీ.

174