పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చక్రస్థుండును నగునన్నారాయణుండు ప్రాజాపత్యతేజంబునం గడమలోకం
బులు నిర్మించె నయ్య కారం బన్యస్వరంబుల హల్లుల సృజియించె నవ్వర్ణంబులు సాధ
నంబులు గాన మూర్తసృష్టి మొదల వేదాంగంబులు శాస్త్రాంగంబులుం గలిగించె
వెండియు నారాయణుండు.

159


గీ.

సంస్మరింపంగ సవ్యాపసవ్యలోచ, నాంచలంబులఁ బుట్టె నీహారవహ్ని
సన్నిభము లైనదివ్యతేజములు రెండు, వానిఁ గొని చేసి రాజదివాకరులను.

160


గీ.

నాసికారంధ్రములఁ బవనంబు వదన, సరసిజంబునఁ బావకధరణిదేవ
తల భుజంబులఁ దొడలఁ బాదముల క్షత్రవైశ్యశూద్రుల నిర్మించె వరుసతోడ.

161


క.

వనజముఖీ తదనంతర, మున యక్షోరక్షనివహముల సంజననం
బునఁ బొందించెఁ బయోజా, సనాండభాండాంతరాళజలపూరమునన్.

162


వ.

మఱి చతుర్విధభూతంబులచేత భూర్లోకంబును వియచ్చరులచేత భువర్లోకంబును
వైమానికులచేత సువర్లోకంబును స్వాంగభూతులుం గల్పోపవాసు లైనసనకాదుల
చేత జనలోకంబును వైరాజులచేతఁ దపోలోకంబును బునర్మారకు లైనగీర్వాణుల
చేత సత్యలోకంబును నిండించె నిండించి మహానుభావుం డతండు జాగ్రదవస్థం
బొంది వినోదింప భూర్భువస్సువర్లోకంబులు జాగ్రదవస్థంబొందె నంతటం గల్పాంత
నిశాసమయంబున సుప్తుం డైన నతనిదేహంబున లయం బై త్రైలోక్యంబును సుప్తిం
బొందె మఱునాఁడు మేల్కొని నిద్రాజ్ఞానమోహితుం డైనతనకు వేదమాతయు
వేదంబులు దేవతలుం బొడగానరామి జగత్స్వామి చింతించి నిజశరీరం బగు
నీరంబున నడంగుట యెఱిఁగి క్రమ్మఱ నిర్మించుకొఱకు జలావగాహంబు గాపింప
నూహించి.

163


ఉ.

వాలుగుమీనురూపమున వాలి గుబాలునినాద మష్టది
క్పాలిక లాక్రమింప నుదకంబులపై నుఱకంగ బిందువు
ల్దూలె నభస్థలంబునకు లోపల నున్నధరావధూటి యి
ల్లాలు విభుండు వచ్చినశుభార్థము లాజలు చల్లెనో యనన్.

164


క.

ఈలీల మొదలివేలుపు, వాలుగు రభసమున నుఱికి వసుమతిఁ గరుణా
లోలమతి నుద్ధరించి ప, యోలీనత మాన్పఁ గని మహోలోకస్థుల్.

165


ఉ.

ఆస్థ లలాటసంఘటితహస్తసరోరుహులై జలాంతవి
శ్వస్థితికారిదేహ రవిచంద్రమరుద్గగనాత్మరూప వ
క్షస్స్థలవీధికాఖచితకౌస్తుభరత్నవినూత్నరోచిరూ
ర్మిస్థగితాష్టదిక్తట తిమింగిలగాత్రధరా ధురంధరా.

166