పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బహుప్రకారంబుల వివేకించి చూచితి. నేఁడువంటిపెనుబండుగున నీయింట దేవ
పూజావిధానంబు గగనప్రసూనంబు వైశ్వదేవబలిహరణంబు లన్న సున్న దీనజన
పరిత్రాణపరాయణత్వంబు శశవిషాణంబు పైతృకాదిప్రముఖవిశిష్టాచారంబు లెల్ల
నిట్ల గావున భవదీయాన్నం బభోజ్యం బని దూరంబలికి వెండియు నధికక్రోధుం డైన
ధర్మవ్యాధుండు మతంగునిం గటాక్షించి.

147


క.

ఇలువడి గలనా కూఁతురు, కొలఁది యెఱిఁగి జీవఘాతికూఁతుర యనుచుం
బలుకఁగ నోయి మునీ నీ, కులకామిని యేవిశిష్టుకూఁతురు చెపుమా.

148


గీ.

హింసకుండ నైనయిట్టినాకూఁతురు, హింసకుఁడవు గానియిట్టినీకుఁ
గోడ లయ్యెఁ జేసికొనుము ప్రాయశ్చిత్త మనుచు, నుల్లసంబు లాడి నవ్వి.

149


మ.

కకుబంతాంతరధాత్రిపై నిది మొద ల్గా సార్వకాలంబు న
త్తకుఁ గోడండ్రకు నొంట కుండెడును ముగ్ధ న్నాతనూజాత నూ
రక భర్జింపక యేలుకొండు మునివర్యా నేఁడు మాయింటఁ బై
తృక మంచు నిఖిలాపురంబునకుఁ బోయె న్వర్జితక్రోధుఁడై.

150


ఉ.

పోయి పితృక్రియల్ నడపి పుత్రుని జీవనచక్రభారధౌ
రేయునిఁ జేసి కీకటవరేణ్యుఁడు దా నరిగెన్ విరక్తుఁడై
పాయక ముక్తికాంతకుచపాళికపజ్జలఁ బత్రభంగముల్
వ్రాయఁగ లోహదండవనవాటికి సన్మునిరత్నపేటికిన్.

151


వ.

ఇవ్విధంబున లోహదఁడమహాగహనం బవగాహించి బహుసహస్రహాయనంబులు
తపఁబు సలిపి విష్ణునామం బనుపుణ్యస్తవంబున వెన్నునిం బ్రసన్నునింజేసి తదీయ
దివ్యదేహంబున లయం బయ్యె నని చెప్పిన మహాత్మా ధర్మవ్యానుండు పఠించినవిష్ణు
నామస్తవంబు వినవలయు నానతి మ్మనిన మహీమహిళకు వరాహదేవుం డి ట్లనియె.

152


సీ.

విష్ణుదేవునకు శ్రీవిపులవక్షునకు విశ్వప్రభునకు షట్పదప్రభునకు
దామోదరునకు భూధరునకు దైత్యసంహారకారికి నృకంఠీరవునకు
చక్రహస్తునకుఁ ద్రివిక్రమునకు మధుకైటభారికి భక్తకామగవికి
శుభవక్త్రునకుఁ బురుష్టుతునకుఁ బురుషోత్తమునకు నిశ్రేయసాఖ్యునకు హరికి
గగనపవనాత్మరవిసుధాకరధరాగ్ని, సలిలమూర్తికి గురునకు జలధివాసు
నకు జనార్దనునకు నరునకు సనాత, నునకు నచ్యుతునకు వరాహునకుఁ బ్రణతి.

153


మ.

అని ఫాలస్థలకీలితాంజలిపుటుండై విష్ణునామస్తవం
బునఁ దన్నుం గొనియాడఁగా నిజకరంబుల్ శంఖచక్రాదిసా